ఆంధ్రాలో రివర్స్ టెండర్ విధానాన్ని కేసీఆర్ అభినందించడాన్ని స్వాగతిస్తున్నామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. అక్కడ 12.6 శాతం తక్కువకు మేఘా కంపెనీ టెండర్ వేసిందని తెలిపారు. కేసీఆర్కు చిత్తశుద్ధి ఉంటే .. తెలంగాణలో కూడా రివర్స్ టెండరింగ్ విధానాన్ని తీసుకురావాలన్నారు. అలాగే తెలంగాణలో కూడా జ్యుడీషియరీ కమిటీ వేసి టెండరింగ్ పర్యవేక్షణ జరగాలని డిమాండ్ చేశారు. మనరాష్ట్రంలో కూడా రివర్స్ టెండరింగ్ చేస్తే ఇక్కడ ప్రాజెక్టుల్లో కూడా 12 శాతం తక్కువకు టెండర్లు వేసేవారని... దానివల్ల ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మాణాల్లో రాష్ట్రానికి 28వేల కోట్లు ఆదా అయ్యేదన్నారు. మిషన్ భగీరథలో కూడా 6వేల కోట్లు ఆదా అయ్యేదని.. రెండూ కలిపితే మొత్తంగా 34వేల కోట్లు ఆదా అయ్యేదని వెల్లడించారు. మొత్తం టెండరింగ్ విధానం మీద విచారణ జరగాలని డిమాండ్ చేశారు. దీనిమీద సమాచారం సేకరించి సీబీఐ విచారణ కోరతామని భట్టి స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: హుజూర్నగర్ బరిలో భాజపా.. పోటీకి ముగ్గురి పేర్ల పరిశీలన..