Bandi sanjay on Agnipath Protest: రాజధానిలో అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న అల్లర్లపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. హైదరాబాద్ నుంచి బాసర ట్రిపుల్ ఐటీకి బయలుదేరిన బండి సంజయ్... సికింద్రాబాద్‌లో చెలరేగిన అల్లర్లపై స్పందిస్తూ కామారెడ్డి జిల్లా బిక్కనూర్‌లో మీడియాతో మాట్లాడారు. తెరాస, ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీలు కలిసి చేసిన కుట్రలో భాగమే ఈ అల్లర్లు అని ఆరోపించారు.
‘ఆర్మీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థుల ముసుగులో కొంతమంది వచ్చి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌పై దాడి చేశారు. తెరాస, ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీలు కలసి చేసిన కుట్రలో భాగమే ఈ అల్లర్లు. ఇంత మంది ఆందోళనకారులు వస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? ఇదంతా పక్కా ప్రణాళిక ప్రకారమే జరిగింది. ప్రభుత్వ ఇంటెలిజెన్స్ ఏం చేస్తోంది? రాష్ట్ర ప్రభుత్వం చేసిన దాడి ఇది. ముసుగులు వేసుకుని వచ్చి దాడికి పాల్పడ్డారు. అందుకే తెలంగాణలో బుల్డోజర్ ప్రభుత్వం రావాలి. అగ్నిపథ్ పేరుతో అభ్యర్థులకు అన్యాయం చేసే ఆలోచన కేంద్రానికి లేదు'.-బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
కొందరు విద్యార్థులను తప్పుదారి పట్టిస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. విద్యార్థులంతా గొప్ప వ్యక్తులు.. వాళ్లు ఇలా చేస్తారని అనుకోను అన్నారు. దేశ ప్రజల ఆస్తి.. మన ఆస్తి అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విధ్వంసాన్ని ప్రోత్సహిస్తోందని సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవు.. కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేసేలా రాష్ట్రం వ్యవహరిస్తోందని తెరాస సర్కార్‌పై మండిపడ్డారు. నిన్నటి కాంగ్రెస్ దాడి, ఇవాళ్టి అల్లర్లు పూర్తిగా తెరాస ప్రోద్బలంతోనే జరిగాయని బండి సంజయ్ ఆరోపించారు.
ఇవీ చదవండి:'అగ్నిపథ్'పై హైదరాబాద్ ఆగ్రహం.. రణరంగంలా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్