పట్టుదల ఉంటే ఎలాంటి లక్ష్యాన్నైనా సాధించవచ్చని గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన యువకుడు నిరూపించాడు. సూపర్ స్పెషాలిటీ కోర్సులకు ఎయిమ్స్ నిర్వహించిన ప్రవేశ పరీక్షల్లో ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ విభాగంలో అవ్వారు ప్రతాప్ కుమార్ జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం సాధించాడు.
ప్రతాప్ కుమార్ తల్లిదండ్రులు మస్తాన్ రావు, పద్మావతి చిలకలూరిపేట పట్టణంలో మిఠాయి దుకాణం నిర్వహిస్తుంటారు. కుమారుడు చదువులో బాగా రాణిస్తుండటంతో తల్లిదండ్రులు మరింత ప్రోత్సాహం అందించారు. పదో తరగతి, ఇంటర్ బైపీసీలోనూ నూరు శాతం ఫలితాలు సాధించారు. ఎంసెట్‌లో 100లోపు ర్యాంకు సాధించి గుంటూరు వైద్య కళాశాలలో సీటు సాధించారు. 2005 నుంచి 2011 వరకు గుంటూరు మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. 2014 నుంచి 2016 వరకు దిల్లీలోని అత్యున్నత వైద్య సంస్థ ఎయిమ్స్‌లో ఎమ్మెస్ జనరల్ పూర్తైంది. ప్రస్తుతం ఎయిమ్స్ ఆధ్వర్యంలో ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ విభాగంలో నిర్వహించిన జాతీయస్థాయి ప్రవేశ పరీక్షలో 100మార్కులకు 91 మార్కులు సాధించి ప్రథమ స్థానం పొందాడు.
జాతీయ స్థాయిలో ఎంసీహెచ్ అంకాలజీ విభాగంలో ప్రథమ స్థానం సాధించడంపై పలువురు ప్రముఖులు ప్రశంసలు గుప్పించారు.
ఇదీ చదవండి: గర్భిణులకు కోఠి ప్రభుత్వాసుపత్రిలో వైద్యం నిరాకరణ