ఏపీలో పంచాయతీ ఎన్నికల పర్వం ముగిసింది. మొత్తం 2,77,17,784 ఓటర్లలో 4 దశల్లోనూ కలిపి 80.14 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. కృష్ణా జిల్లాలో గరిష్ఠంగా 84.97%, విజయనగరం జిల్లాలో కనిష్ఠంగా 64.02 శాతం మంది ఓటింగులో పాల్గొన్నారు. పంచాయతీ ఎన్నికలు పార్టీలకు అతీతమైనా ప్రధాన రాజకీయ పక్షాలన్నీ తమ మద్దతుదారులను బరిలో దింపడంతో సహజంగానే ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్‌కుమార్ ఈ ఎన్నికల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. కోర్టుల్లో కేసులతో ఒకానొక దశలో ఎన్నికలు ఉంటాయా ఉండవా అనే అనుమానం నుంచి కేవలం నెల రోజుల వ్యవధిలో ప్రక్రియ మొత్తం పూర్తయింది.
2013లో జరిగిన పంచాయతీ ఎన్నికలతో పోల్చితే ఈ ఎన్నికల్లో ఏకగ్రీవాల సంఖ్య పెరిగింది. అప్పట్లో 13 జిల్లాల్లో 1,835 సర్పంచి స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఈ ఎన్నికల్లో 2,197 సర్పంచి స్థానాలుఏకగ్రీవమైనట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలోని 13,330 పంచాయతీల్లో 233 చోట్ల కోర్టు కేసుల కారణంగా ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వలేదు. 13,097 పంచాయతీలకు నోటిఫికేషన్ ఇవ్వగా 10 చోట్ల ప్రజలు నామినేషన్ వేయలేదు.
వచ్చే నెలాఖరులోగా ‘స్థానికం’ పూర్తి!
వచ్చే నెలాఖరులోగా మిగిలిన ఎన్నికలన్నీ పూర్తి చేసే యోచనతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఉంది. పుర, నగరపాలక, నగర పంచాయతీ ఎన్నికల పోలింగ్ వచ్చే నెల 10న నిర్వహించనున్న విషయం తెలిసిందే. 14న ఓట్లు లెక్కించి విజేతలను ప్రకటించనున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల విషయంలో ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవలసి ఉంది. ఎక్కడ నిలిపి వేశారో అక్కడి నుంచి మళ్లీ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించేలా ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటుందా? పాత నోటిఫికేషన్ రద్దు చేసి కొత్తగా మళ్లీ ఇస్తుందా అనేది రాష్ట్రంలో ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది.