Amaravati Capital Farmers Padayatra: ఆంధ్రప్రదేశ్ రాజధాని రైతుల మహా పాదయాత్ర 2.0కు అంకురార్పణ జరిగింది. అమరావతిపై అధికార పార్టీ పెద్దలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు, రాజధాని ఆవశ్యకతను రాష్ట్ర ప్రజలకు వివరించేందుకు అమరావతి ప్రాంత రైతులు మహా పాదయాత్ర 2.0కు శ్రీకారం చుట్టారు. వెంకటపాలెంలోని తితిదే ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయం వెలుపల ఉన్న వేంకటేశ్వర స్వామి రథాన్ని నడిపి అంకురార్పణ చేశారు. సర్వమత ప్రార్థనలు నిర్వహించిన అనంతరం రైతులు పాదయాత్రను ప్రారంభించారు.
ప్రత్యేక ఆకర్షణగా వేంకటేశ్వరస్వామి రథం: పాదయాత్ర లో పార్టీలకు అతీతంగా రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కొంతమంది వైకాపా కార్యకర్తలు సైతం పాదయాత్ర కు తమ మద్దతు తెలిపారు. దీంతో రథం నడిపే బాధ్యతను వైకాపా కార్యకర్తలకే రైతులు అప్పగించారు. అనంతరం మాజీ మంత్రులు మాగంటి బాబు, కామినేని శ్రీనివాస్, సీపీఐ నేత నారాయణ కొద్దిసేపు రథం నడిపారు. మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌తో పాటు పలువురు తెదేపా, భాజపా, కాంగ్రెస్, జనసేన, వామపక్షాల నేతలు రైతుల పాదయాత్రకు మద్దతు తెలిపారు. వెంకటపాలెం నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్ర.. కృష్ణాయపాలెం, యర్రబాలెం మీదుగా సాయంత్రానికి మంగళగిరి చేరుకుంటుంది. రాత్రికి అక్కడే బస చేస్తారు. రైతులు, మహిళలు మొదటి రోజు దాదాపు 15 కి.మీ. మేర నడవనున్నారు. పాదయాత్రలో వేంకటేశ్వరస్వామి రథం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
అమరావతి అభివృద్ధి చెందితేనే అందరికీ అభివృద్ధి ఫలాలు: మూడు రాజధానుల ప్రకటన వెలువడిన వెంటనే దాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని రైతులు ప్రారంభించిన ఉద్యమం నేటితో వెయ్యి రోజులకు చేరింది. ఈ సందర్భంగా రెండో విడత పాదయాత్రకు రైతులు శ్రీకారం చుట్టారు. అమరావతి అభివృద్ధి చెందితేనే ఆ ఫలాలు రాష్ట్ర ప్రజలందరికీ అందుతాయని.. అంతిమంగా ఆంధ్రప్రదేశ్ పురోగతి సాధించనుందని పాదయాత్రలో రైతులు వివరించనున్నారు. రాజధాని పరిధిలోని 29 గ్రామాల నుంచి రైతులు, రైతు కూలీలు, మహిళలు, అన్ని వర్గాలవారు విడతలవారీగా ఇందులో పాల్గొంటున్నారు. వెంకటపాలెంలో ప్రారంభమైన ఈ పాదయాత్ర.. వెయ్యి కి.మీ. సాగి నవంబరు 11న శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలోని సూర్యభగవానుడి చెంతకు చేరనుంది.
ఇవీ చదవండి: