వ్యవసాయరంగంపై ఆధారపడే వారు క్రమంగా తగ్గుతున్నారని అమరరాజా సంస్థల ఛైర్మన్ రామచంద్రనాయుడు అభిప్రాయపడ్డారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పారిశ్రామికవేత్తగా ఎదిగేందుకు అనేక మెట్లు ఎక్కినట్లు ఆయన వెల్లడించారు. యువతకు వివిధ రకాల ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో భారత్లో పరిశ్రమలు పెట్టినట్లు వివరించారు.
సాగుభూమి వాడకూడదన్న నిబంధనతో..
పరిశ్రమకు సాగుభూమి వాడకూడదనే నిబంధనతో కంపెనీలు ఏర్పాటు చేసినట్లు అమరరాజా సంస్థల ఛైర్మన్ రామచంద్రనాయుడు తెలిపారు. పిచ్చి మొక్కలతో నిండిన భూమిని పచ్చదనంతో నింపామని వెల్లడించారు. అమరరాజా పరిశ్రమది 36 ఏళ్ల ప్రయాణం అని గల్లా రామచంద్రనాయుడు పేర్కొన్నారు. మనదేశంలో గ్రామాల్లో నివసించేవారే అధికంగా ఉన్నారని, వారికి ఏదైనా చేయాలని చిన్నప్పుడే అనుకున్నట్లు వివరించారు.
1985లో చిన్న గ్రామంలో పరిశ్రమ..
తన మామ రాజగోపాలనాయుడు స్ఫూర్తితో ప్రజాసేవలోకి వచ్చినట్లు రామచంద్రనాయుడు తెలిపారు.
18 ఏళ్లు అమెరికాలో ఉండి స్వదేశానికి తిరిగి వచ్చా. మొట్టమొదటగా 22 మందితో పరిశ్రమను మొదలుపెట్టాం. ఈరోజు అన్ని ప్లాంట్లలో కలిపి ప్రత్యక్షంగా 18వేల మందికి ఉపాధి కల్పించాం. ఇంతకు 3 రెట్ల మందికి పరోక్షంగా ఉపాధి కల్పించాం. చిత్తూరు జిల్లాలో రూ.6వేల కోట్లు పెట్టుబడులు పెట్టాం. మా ప్లాంట్లన్నీ గ్రామాల్లోనే ఏర్పాటు చేశాం. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వారినే ఉద్యోగులుగా తీసుకున్నాం. విద్యార్హత లేని వారికి కూడా ఉద్యోగాలిచ్చాం. అనంతరం వారికి శిక్షణ ఇచ్చాం. ఉద్యోగులు ఇబ్బంది పడకుండా అన్ని చర్యలూ తీసుకున్నాం. పరిశ్రమ కోసం వ్యవసాయ భూముల్ని వినియోగించలేదు. పరిశ్రమకు సాగుభూమి వాడకూడదనే నిబంధన పెట్టుకున్నాం. పిచ్చి మొక్కలతో నిండిన భూమిని పచ్చదనంతో నింపాం. 1985లో చిన్న గ్రామం కరకంబాడిలో పరిశ్రమ విస్తరించాం. అనంతరం తమ స్వగ్రామం పేటమిట్టలో పరిశ్రమను నెలకొల్పాం - రామచంద్రనాయుడు, అమరరాజా సంస్థల ఛైర్మన్.
ఇవీ చదవండి: huzurabad bypoll: కేసీఆర్ను కలిసిన హుజూరాబాద్ తెరాస అభ్యర్థి