ఓవైపు చలి, మరోవైపు వాయు కాలుష్యం భాగ్యనగరాన్ని వణికిస్తున్నాయి. వాహనాలు, రోడ్లు, నిర్మాణాలు తదితర కార్యకలాపాల వల్ల రోజూ 40 రకాల కాలుష్య ఉద్గారాలు గాలిలోకి విడుదలవుతాయి. వీటిలో పీఎం 10, పీఎం 2.5 ప్రమాదకరం. ఇప్పుడివే నగరాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మన తల వెంట్రుక మందం 50 మైక్రోగ్రాములు. దీనికంటే పీఎం 10 సైజు అయిదు రెట్లు తక్కువగా ఉండి స్వచ్ఛమైన గాలిని కలుషితం చేస్తుంది. పీఎం 2.5 అయితే 20 రెట్లు తక్కువగా ఉండటమే కాక కంటికి కనిపించదు. ముక్కు ద్వారా నేరుగా ఊపిరితిత్తుల్లోకి చేరి శ్వాసకోశ, ఇతర అనారోగ్య సమస్యలకు కారణమవుతోంది.
ఈ కాలంలోనే ఎందుకంటే..
సాధారణంగా కాలుష్య ఉద్గారాలు గాల్లోకి విడుదల కాగానే అటు ఇటు కదులుతూ(వ్యాప్తి) భూమిని చేరుతాయి. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటే తేలికగా మారి వెంటనే కిందకు వచ్చేస్తాయి. అదే తక్కువగా ఉంటే ఎటూ కదలకుండా ఒకే చోట ఉండిపోయి నేలకు చేరేందుకు చాలా సమయం పడుతుంది. అందుకే వేసవి, వర్షాకాలాలతో పోలిస్తే శీతాకాలంలో వాయు కాలుష్యం అధికంగా నమోదవుతుందని పీసీబీ సీనియర్ పర్యావరణ శాస్త్రవేత్త(విశ్రాంత) డా.వీరన్న పేర్కొన్నారు. ముఖ్యంగా ధూళి కణాలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయని, ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ తగ్గుముఖం పడతాయన్నారు. ఈ సమయంలో బయటికెళ్లేటప్పుడు కనీస జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ఆ మార్కు దాటేసి
కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సీపీసీబీ) నిర్దేశిత పరిమితుల ప్రకారం పీఎం 10 వార్షిక సగటు ఘనపు మీటరు గాలిలో 60 ఎంజీలు దాటకూడదు. అదే ప్రపంచ ఆరోగ్య సంస్థ అయితే 20 ఎంజీలు దాటితే ప్రమాదకరమని హెచ్చరిస్తోంది. పీఎం 2.5.. 40 ఎంజీలు దాటరాదు. 10 ఎంజీలు దాటితే ఇబ్బందేనని డబ్ల్యూహెచ్‌ఓ సైతం స్పష్టంచేసింది. నగరంలో ఒకటి, రెండుచోట్ల మినహా అంతటా పీఎం 10 తీవ్రత గత నెలలో అధికంగానే నమోదైంది. బాలానగర్, ఉప్పల్, హెచ్‌సీయూ, జూపార్కు, జీడిమెట్ల, చార్మినార్, నాచారంలో 100 మార్కు దాటింది. పీఎం 2.5 అన్ని ప్రాంతాల్లో ఎక్కువగానే ఉంది. హెచ్‌సీయూ దగ్గర 48 నుంచి 54 ఎంజీలు, సనత్‌నగర్‌లో 54నుంచి 63, జూపార్క్ వద్ద 63 నుంచి 76, జీడిమెట్లలో 22-28, ప్యారడైజ్‌లో 17 ఎంజీల నుంచి 30 ఎంజీలకు పెరిగింది.