ఆలమట్టి డ్యామ్ ఎత్తు పెంపునకు కర్ణాటక ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అడ్డుకోవాలని ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్ రెడ్డి డిమాండ్ చేశారు. 519.6 మీటర్ల నుంచి 524.2 మీటర్లకు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వ అనుమతుల కోసం ప్రతిపాదనలు పంపినట్టు కర్ణాటక నీటి వనరులశాఖ మంత్రి రమేష్ జార్కిహోలి ప్రకటించినట్టు తెలిపారు. అంతేకాకుండా... భూసేకరణ, డ్యామ్ నిర్మాణానికి రూ. 61 వేల కోట్ల వ్యయం కానున్నట్టు అధికారుల అంచనా వేశారు. ఇదే జరిగితే రాష్ట్రానికి రావాల్సిన వరద నీరు ఆగిపోయి... దక్షిణ తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి... కర్ణాటక ముఖ్యమంత్రితో మాట్లాడాలని, అవసరమైతే కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని సూచించారు. 4.6 మీటర్ల ఎత్తు పెంచడం ద్వారా ఇప్పడు వాడుకుంటున్న 173 టీఎంసీలకు అదనంగా 130 టీఎంసీలు కర్ణాటక ఉపయోగించుకుంటోందని పేర్కొన్నారు. ఎత్తు పెంపుతో తెలంగాణ, ఆంధ్రాకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని తెలిపారు. ఎగువన ఉండే మహారాష్ట్రలోని సతారా, సాంగ్లి, కొల్హాపూర్ జిల్లాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. ఎగువన ఆలమట్టి, దిగువన పోతిరెడ్డిపాడు ద్వారా తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతున్నా... ముఖ్యమంత్రి ప్రేక్షకపాత్ర పోషించడంపై ఆశ్చర్య వ్యక్తం చేశారు. తక్షణమే అఖిలపక్షం ఏర్పాటు చేసి... సంఘటితంగా కర్ణాటక ఎత్తుగడలను తిప్పికొట్టాలన్నారు.
ఇదీ చూడండి: 'ఎలిమెంట్స్.. యావత్ భారతం గర్వపడేలా చేస్తుంది'