రాష్ట్రంలో వ్యవసాయరంగం గణనీయమైన సంపదను సృష్టించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కరోనా కారణంగా పలు రంగాలు కుదేలైనా వ్యవసాయ, అనుబంధ రంగాల్లో మాత్రం ఉత్పాదకతలో వృద్ధిరేటు నమోదైంది. పంటల సాగు, పశుసంపద, అటవీ సంపద, మత్స్యపరిశ్రమల్లో ఉత్పాదకత పెరిగింది. రాష్ట్ర స్థూల విలువ జోడింపు (జీఎస్‌వీఏ) గణాంకాలను అర్థ గణాంక శాఖ కేంద్ర ప్రభుత్వానికి అందించింది.
2020-21 ఆర్థిక సంవత్సరంలో ఉత్పాదకత పెరిగిన రంగాల్లో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలతో పాటు సమాచార, బ్రాడ్‌కాస్టింగ్ సేవలు, ఆర్థిక సేవలు, ప్రజాపాలన, స్థిరాస్తి రంగాలు ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచీ కరోనా తీవ్ర ప్రభావం చూపటంతో అత్యధిక రంగాల్లో ఉత్పాదకత ద్వారా సంపద సృష్టి గత ఏడాది కంటే తగ్గింది. తెలంగాణ ఆవిర్భావం నుంచి ఏటా సగటున 10 నుంచి 13 శాతం వరకు ఉత్పాదకత ద్వారా సంపద పెరిగేది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉత్పాదకత కేవలం 1.7 శాతం మాత్రమే పెరిగింది. పైన పేర్కొన్న కొన్ని రంగాల పురోగతి వల్ల రాష్ట్ర జీఎస్‌వీఏలోనూ పెరుగుదల సాధ్యమైంది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ)లో 1.35 శాతం వృద్ధిరేటు ఉండగా తలసరి ఆదాయంలో 0.61 శాతం వృద్ధిరేటు నమోదైంది. ప్రాథమిక రంగాల్లో గనులు మినహా మిగిలినవాటిలో ఉత్పాదకత పెరిగింది. ద్వితీయరంగంలోని అన్నింటిలోనూ ఉత్పాదకత ద్వారా సంపదసృష్టి తగ్గింది.
- ఉత్పాదకత పెరిగినవి
ప్రాథమిక రంగం: వ్యవసాయం, పంటల ఉత్పాదకత, పశు సంపద, అటవీసంపద, మత్య్స పరిశ్రమ
సేవల రంగం: బ్రాడ్‌కాస్టింగ్ సేవలు, ఆర్థిక సేవలు, ప్రజాపాలన, స్థిరాస్తి, ఇళ్లఅమ్మకాలు
- తగ్గినవి
ప్రాథమిక రంగం: గనులు
ద్వితీయ రంగం: తయారీ, విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఇతర వినియోగసేవలు, నిర్మాణ రంగం
సేవల రంగం: వాణిజ్యం, మరమ్మతు సేవలు, హోటళ్లు, రెస్టారెంట్లు, రైల్వే, రోడ్డు రవాణా, విమానయానం.
ఇదీ చదవండి : పసుపు బోర్డు ఆశలపై కేంద్రం నీళ్లు... మళ్లీ ఉద్యమానికి రైతులు సిద్ధం