ఏపీ తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలంలోని అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ రథం దగ్ధమైంది. తెల్లవారుజామున ఒంటిగంట సమయంలో ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఏటా స్వామివారి కల్యాణోత్సవంలో ఉత్సవమూర్తులను రథంపై ఊరేగించి.... ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షెడ్డులో పదిల పరుస్తారు. అలాంటిచోట ఉన్న రథం దగ్ధం కావడం ఏంటని... స్థానికులు, భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఘటనపై విచారణ జరిపించాలంటూ ఆలయం వద్ద ఆందోళనకు దిగారు.
సీఐడీతో విచారణ జరిపించాలి..
రథం దగ్ధం ఘటనను విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఖండించారు. రథం దగ్ధం ఆమోదయోగ్యం కాదని అఖిల భారత హిందూ మహాసభ పేర్కొంది. ఘటనను ప్రొఫెసర్ జీవీఆర్ శాస్త్రి... కేంద్ర హోంమంత్రి అమిత్ షా, గవర్నర్ బిశ్వభూషణ్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంపై సీఐడీ విచారణకు ఆదేశించాలని కోరారు. 60 ఏళ్లుగా స్వామివారి కల్యాణోత్సవానికి ఉపయోగించిన రథం దగ్ధం కావడం దురదృష్టకరమని... తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఘటనపై ఏపీ ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమన్నారు.
ఘటనపై అనుమానాలు!
అంతర్వేది రథం కాలిన విధానం అనుమానస్పదంగా ఉందని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి స్వయంగా స్పందించాలని ఎంపీ కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
విచారణకు ఆదేశం
రథం దగ్ధంపై దేవదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విచారణకు ఆదేశించారు. విచారణాధికారిగా దేవదాయ శాఖ అదనపు కమిషనర్ రామచంద్రమోహన్‌ను నియమించారు. రథం పునర్నిర్మాణానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఘటనాస్థలిని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పరిశీలించారు. దర్యాప్తు జరిపి దోషులను పట్టుకుంటామన్నారు.
ఇవీ చూడండి : రాష్ట్రంలో రాగల మూడు రోజులపాటు అక్కడక్కడా వర్షాలు