కరోనా రూపంలో ఊహించని విపత్తు విరుచుకుపడినా.. వైద్యసేవలు అందించడంలో ప్రభుత్వం విజయవంతమైందని ఆర్థికమంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. పేదలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటోందని స్పష్టం చేశారు. వైద్యరంగం బలోపేతానికి బడ్జెట్‌లో అత్యంత ప్రాధాన్యం కల్పించామని వివరించారు. మరిన్ని మెరుగైన సేవల కోసం బడ్జెట్‌లో వైద్యారోగ్య శాఖకు రూ. 6వేల 295 కోట్లు ప్రతిపాదించారు.
పేదలకు కార్పొరేట్ తరహాలో వైద్యసేవలు అందించేందుకు కృషిచేస్తున్న ప్రభుత్వం... ప్రజారోగ్యం కోసం అనేక సంస్కరణలు చేపట్టినట్లు తెలిపారు. పేద ప్రజల కోసం ప్రత్యేకంగా 25 డయాగ్నోస్టిక్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. 2020-21 నాటికి రాష్ట్రంలో 49 డయాలసిస్ సెంటర్లను తెరాస సర్కారు ఏర్పాటు చేశామన్నారు. వీటిల్లో ఇప్పటి వరకు ఏడాదికి సగటున 10,500 మంది చికిత్స పొందుతున్నట్లు వివరించారు. 224 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.