హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్ ఒడ్డున అంబేడ్కర్ విగ్రహ నిర్మాణం కోసం త్వరలో టెండర్లు పిలుస్తామని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడించారు. ఏడాదిలోగా నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. దేశం అబ్బుర పడేలా 125 అడుగుల ఎత్తు విగ్రహాన్ని ఏర్పాటుచేస్తామని.. అక్కడ పరిసరాలను పచ్చదనంతో తీర్చిదిద్దుతామని కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు.
విగ్రహ ఏర్పాటుపై అధికారులు, ఇంజనీర్లు, కన్సల్టెన్సీ ప్రతినిధులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. విగ్రహ నమూనా, ప్రాజెక్టు రూపకల్పనకు సంబంధించిన అంశాలపై ఆరా తీశారు. కన్సెల్టెన్సీ కంపెనీ ప్రతినిధుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. పలు సూచనలిచ్చారు. అన్ని అంశాలను ముఖ్యమంత్రికి నివేదించి టెండర్లు పిలిచేందుకు అనుమతి తీసుకుంటామని కొప్పుల తెలిపారు.
మొత్తం 175 అడుగులు..
50 అడుగుల ఎత్తులో పార్లమెంట్‌ను పోలిన పీఠాన్ని నిర్మించి దానిపై 125 అడుగుల విగ్రహాన్ని నిలుపుతామన్నారు. దీంతో మొత్తం ఎత్తు 175 అడుగులు అవుతుందన్నారు. పీఠం నిర్మాణం తయారీకి రాజస్థాన్‌లోని ధోల్పూర్కు చెందిన శాండ్‌స్టోన్ ఉపయోగించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. రూ. 146 కోట్ల ఈ ప్రాజెక్టును చేపడుతున్నట్లు తెలిపారు.
మ్యూజియం, అంబేడ్కర్ జీవితచరిత్రలో ముఖ్య ఘట్టాలకు సంబంధించిన ఫోటో ఆర్ట్ గ్యాలరీ, ఎగ్జిబిషన్, ఆయన అధ్యయనం చేసిన, రచించిన, ఆయన గురించి ఇతరులు రాసిన పుస్తకాలు, పరిశోధనా గ్రంథాలతో కూడిన గ్రంథాలయం ఏర్పాటవుతుందని మంత్రి తెలిపారు. ధ్యానమందిరం, అంబేడ్కర్ జీవిత విశేషాలతో రూపొందించిన లేజర్ షో, సమావేశ మందిరం, సువిశాలమైన పార్కింగ్ తదితర ఏర్పాట్లు ఉంటాయన్నారు.
ఈ స్ఫూర్తి కేంద్రం అన్నివర్గాల ప్రజల ఆత్మగౌరవం మరింత పెంపొందేలా, భావితరాలకు స్ఫూర్తినిచ్చేలా అద్భుతంగా రూపుదాల్చనుందని మంత్రి తెలిపారు.