ఈనెల 14న అంబేడ్కర్ జయంతి వేడుకల్లో సీఎం కేసీఆర్ హాజరుకాకపోవడాన్ని తప్పుపడుతూ నిన్న ట్యాంక్ బండ్ వద్ద మందకృష్ణ మాదిగ ఆందోళన చేపట్టారు. ఇందిరాపార్క్- ధర్నాచౌక్ వద్ద నిరసన కార్యక్రమానికి అనుమతి కోరారు. అందుకు నిరాకరించిన పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా అంబర్పేట్లోని ఆయనను గృహ నిర్బంధం చేశారు.
పోలీసుల చర్యలపై మందకృష్ణ తీవ్రంగా స్పందించారు. అన్యాయం జరిగితే ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందన్నారు. ఇప్పటికి ఐదేళ్లు గడుస్తున్నా... ఒక్కసారైన కేసీఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారా అని నిలదీశారు. ఉద్దేశపూర్వకంగా బడుగులను అవమాన పరుస్తున్నారని ధ్వజమెత్తారు. తెరాస అధినేతగా కూడా కేసీఆర్ అంబేడ్కర్ ఉత్సవాల్లో పాల్గొనలేదన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపేందుకూ అనుమతి నిరాకరించడాన్ని తప్పుబట్టారు.
గృహనిర్బంధలో ఉన్న మందకృష్ణను కాంగ్రెస్ నేతలు పొన్నాల లక్ష్మయ్య, పొన్నం ప్రభాకర్, భాజపా నేత కిషన్రెడ్డి, జన సమితి అధినేత కోదండరాం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య కలిసి సంఘీభావం తెలిపారు. రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయడం, ప్రజా గొంతుకను అణగదొక్కేందుకు ప్రభుత్వం ప్రయత్నించడాన్ని నేతలంతా ముక్తకంఠంతో ఖండించారు.
ఇవీ చూడండి: 20కి పైగా జిల్లా పరిషత్లు గెలుస్తాం: పొన్నం