Movement of Maoists: మావోయిస్టు దళ సభ్యులు ప్రాణహిత నది మీదుగా ప్రవేశించి ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలంలో సంచరిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో ఎస్పీ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు దళాలు వారం రోజులుగా అడవులను జల్లెడ పడుతున్నాయి. గ్రామస్థులను, గ్రామ పటేళ్లు, పెద్ద మనుషులను కలిసి వీరికి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. కొత్త వ్యక్తులు, మావోయిస్టులు ఎవరైనా కనిపించినా సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మూడేళ్లుగా మైలారపు అడెల్లు ఆలియాస్ భాస్కర్ దళం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో సంచరిస్తూ పోలీసులకు చిక్కినట్లే చిక్కి తప్పించుకుంటున్నారు.
నాలుగైదు రోజుల క్రితం ప్రాణహిత నది దాటి జిల్లాలోకి మావోయిస్టుల బృందం ప్రవేశించిందని పోలీసులకు సమాచారం అందింది. దీంతో సిర్పూర్ టి, బెజ్జూరు, దహెగం, పెంచికల్పేట్ మండలాల్లోని మారుమూల గ్రామాల్లోనూ, ప్రాణహిత నది పరివాహక ప్రాంతాల్లో పోలీసులు నిత్యం తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఉదయం సాయంత్రం వేళల్లో ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. కొత్త వ్యక్తులు మావోయిస్టులు ఎవరికైనా కనిపించారా అని ఆరా తీస్తున్నారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక పల్లె ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
గతంలో చోటు చేసుకున్న సంఘటనలు.. 2020 సెప్టెంబర్ నెలలో డిజిపి మహేందర్ రెడ్డి జిల్లా కేంద్రంలో రెండు రోజులపాటు ఉంటూ మావోయిస్టులను పట్టుకునేందుకు వ్యూహరచన చేశారు. ఇదే నెలలో డిజిపి రెండుసార్లు జిల్లాకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ సమయంలో తిర్యాని మండలం తొక్కిగూడలో ఎదురుకాల్పులు సైతం చోటు చేసుకోగా ఎవరికి గాయాలు కాలేదు. అక్కడ లభించిన డైరీ వివరాల ఆధారంగా 11 మంది మావోయిస్టు సానుభూతిపరులను పోలీసులు, టోకీగూడ గ్రామ పటేళ్లను అప్పట్లో పోలీసులు అరెస్టు చేశారు. 2020 సెప్టెంబర్ నెలలోనే కాగజ్నగర్ మండలం కడంబా అడవుల్లో ఇద్దరు మావోయిస్టులు ఎన్కౌంటర్లో చనిపోయారు. ఈ నెలలోనే పెంచికల్ పేటకు చెందిన ఆరుగురు వ్యక్తులు మావోయిస్టుల్లో చేరడానికి సన్నద్ధమయ్యారు. పోలీసులకు సమాచారం అందడంతో వీరిని అదుపులోకి తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే.
రిక్రూట్మెంట్ లక్ష్యంగా పావులు.. తాజాగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మళ్లీ మంచిర్యాల, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఏరియా కమిటీ కార్యదర్శి మైలారపు అడేళ్లు బృందం కదలికలు ఉన్నట్లుగా సమాచారం రావడంతో 100 మంది ప్రత్యేక పోలీసు దళాలు తిర్యాని మండలంలోని మంగి ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. 25 సంవత్సరాలకు పైగా నక్సల్స్ ఉద్యమంలో ఉన్న భాస్కర్ కు ఈ ప్రాంతం పై పూర్తిస్థాయిలో పట్టు ఉందని, ఇక్కడి మారుమూల గ్రామాలకు చెందిన వ్యక్తులు సహకారం అందించే క్రమంలో దళంలోకి రిక్రూట్మెంట్ పెంచుకునే అవకాశం ఉందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మావోయిస్టులకు సహకారం లభించకుండా పోలీసులు నిఘా పెంచారు.
అసాంఘిక శక్తులకు సహకరించవద్దు.. యువత మావోయిస్టులు మాటలకు ఆకర్షితులు కావద్దని జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ పేర్కొన్నారు. శనివారం తిర్యాని మండలం కౌటాగాం గ్రామపంచాయతీలోని తాటి గూడలో గిరిజనులతో సమావేశం నిర్వహించారు. యువత, ప్రజలు మావోయిస్టులకు సహకరించవద్దనని తెలిపారు. అనంతరం కేరిగూడ, ఎర్రబండ గిరిజన గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఇటీవల ఈ గిరిజన గ్రామాల్లో 10 నుంచి 15 మంది మావోయిస్టులు సంచరించినట్లు సమాచారం ఉందన్నారు. అపరిచిత వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏ సమస్య ఉన్నా ప్రభుత్వం లేదా పోలీసుల ద్వారా పరిష్కరించుకోవాలన్నారు. గిరిజనులకు చదివే ఆయుధమని ప్రభుత్వం గిరిజన ప్రాంతాల్లో ఆశ్రమ పాఠశాలలో నెలకొల్పిందని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. 'పోలీసులు మీకోసం' కార్యక్రమంలో భాగంగా గిరిజన ప్రాంతాల్లో వైద్య శిబిరాలు, రహదారుల నిర్మాణం, ఉచితంగా నిత్యావసర సరుకులు, యువకులకు క్రీడా సామాగ్రి పంపిణీ చేసినట్లు వివరించారు. ఈ సందర్భంగా గిరిజనులు తమ సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఆసిఫాబాద్ డిఎస్పి శ్రీనివాస్, రెబ్బెన సిఐ నరేందర్, ఎస్సై రమేష్, కౌటాగాం సర్పంచి కోట్నాక గణపతి, గ్రామ పటేళ్లు అంబారావు, భారీక్ రావు, మోతీ రామ్ తదితరులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: