ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి ఏటా గణేశ్ ఉత్సవాలను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకోవడం ఆనవాయితీ. ఇందులో భాగంగా భారీ విగ్రహల ప్రతిష్ఠాపన.. విద్యుత్ అలంకరణలు, భారీ సెట్టింగులు.. సందేశాలనిచ్చే సన్నివేశాలు.. ఇలా ఒకటేమిటి పదకొండు రోజుల పాటు సందడే సందడి. కరోనా పుణ్యమా అని ఈసారి ఆ సందడి కరువైంది. ప్రధాన కూడళ్లన్నీ మండపాలు లేక బోసిపోతున్నాయి. ప్రభుత్వ ఆంక్షల నేపథ్యంలో భారీ విగ్రహాలు కనిపించకుండా పోయాయి. వాటి స్థానాల్లో చిన్న విగ్రహాలు దర్శనమిస్తున్నాయి.
సాదాసీదాగా వేడుకలు..
కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా మునపటిలా ఆర్భాటంగా కాకుండా సాదాసీదాగా వేడుకలు నిర్వహించేందుకు ప్రజలు సన్నద్ధమవుతున్నారు. మండపాల్లో కాకుండా ఆలయాల్లో విగ్రహాలు పెట్టి సంప్రదాయాన్ని కొనసాగించే దిశగా ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు నిర్వాహకులు, భక్తులు చెబుతున్నారు.
దసరాలోగా వైరస్ తగ్గిపోవాలని..
నిరాంబరంగా వినాయక చవితి జరుపుకునేందుకు ప్రజలు మక్కువ చూపగా.. విఫణిలో వ్యాపారులు అవస్థలు పడుతున్నారు. క్షణం తీరికలేకుండా ఉండే తాము కరోనా కారణంగా గిరాకీ లేక ఇబ్బందులు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం దుర్గా నవరాత్రి వేడుకల్లోగా కరోనా ప్రభావం తొలగిపోవాలని కోరుకుంటున్నారు.
ఇవీ చూడండి: డీలాపడ్డ పూల మార్కెట్.. ఆవేదన చెందుతున్న రైతులు