ట్విట్టర్ తమ ప్రీమియం సేవల్ని సోమవారం (డిసెంబరు 12) నుంచి తిరిగి ప్రారంభించనుంది. దీంతో ప్రత్యేక రుసుము చెల్లించిన వారు 'బ్లూ టిక్‌మార్క్'తో పాటు ప్రత్యేక ఫీచర్లతో కూడిన 'ట్విట్టర్ బ్లూ' సేవల్ని పొందొచ్చు. గతంలో 'బ్లూ టిక్' కేవలం కంపెనీలు, ప్రభుత్వ సంస్థలు, జర్నలిస్టులు, ఇతర ప్రముఖులకు మాత్రమే ఇచ్చేవారు. సదరు ఖాతాలను తనిఖీ చేసి వాటిని అధికారిక ఖాతాలుగా గుర్తించేవారు. ఇప్పుడు ఈ ప్రత్యేక గుర్తింపును రుసుము చెల్లించి ఎవరైనా పొందేందుకు వీలుంది.
వాస్తవానికి 'ట్విట్టర్ బ్లూ' సేవల కోసం ప్రత్యేకంగా సబ్‌స్క్రిప్షన్ ఫీజును చెల్లించే విధానాన్ని ట్విట్టర్ నెల క్రితమే తీసుకొచ్చింది. కానీ, నకిలీ ఖాతాల బెడద ఎక్కువవడంతో తాత్కాలికంగా నిలిపివేసింది. తగిన మార్పులు చేసి పునరుద్ధరిస్తామని తెలిపింది. తాజాగా సబ్‌స్క్రిప్షన్ ఛార్జీల్లో సవరణలు చేయడం గమనార్హం. వెబ్ యూజర్లకు నెలకు 8 డాలర్లుగా నిర్ణయించగా.. ఐఫోన్ యూజర్లకు 11 డాలర్లుగా నిర్దేశించారు. యాపిల్ తమ ప్లేస్టోర్ నుంచి యాప్‌లకు చేసే చెల్లింపులపై 30 శాతం రుసుము వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐఫోన్ యూజర్లకు ట్విట్టర్ అధిక ఫీజును వసూలు చేయాలని నిర్ణయించినట్లు నిపుణులు చెబుతున్నారు.