Nirmala sitharaman on rupee fall: ఇటీవల రూపాయి విలువ భారీగా పతనమైన వేళ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభ వేదికగా వివరణ ఇచ్చారు. వాస్తవానికి రూపాయి విలువలో ఎలాంటి పతనం లేదని పేర్కొన్నారు. దాని సహజరీతిలోనే అది ముందుకు సాగుతోందని వ్యాఖ్యానించారు. ఆర్‌బీఐ నిరంతరం రూపాయి కదలికలపై దృష్టి సారిస్తోందని తెలిపారు. అయితే, అవసరమైనప్పుడు కేవలం ఒడుదొడుకులను కట్టడి చేసేందుకు మాత్రమే ఆర్‌బీఐ మధ్యలో జోక్యం చేసుకుంటోందని వివరించారు. అంతే తప్ప రూపాయి విలువను నిర్దేశించే చర్యలేమీ చేపట్టడం లేదని తెలిపారు.
ఇతర దేశాల తరహాలో ప్రభుత్వంగానీ, ఆర్‌బీఐగానీ రూపాయి విలువ విషయంలో జోక్యం చేసుకోవడం లేదని సీతారామన్ తెలిపారు. రూపాయి సహజరీతిలో ముందుకు వెళ్తోందని పేర్కొన్నారు. అయితే, దీర్ఘకాలంలో రూపాయి బలోపేతానికి కావాల్సిన చర్యలపై మాత్రం ప్రభుత్వం, ఆర్‌బీఐ దృష్టి సారించాయని తెలిపారు. ప్రవాస భారతీయులు విదేశీ కరెన్సీల్లో డబ్బులు బదిలీ చేసేందుకు అనుమతి ఇవ్వాలని విపక్ష సభ్యులు మంత్రికి సూచించారు. దీనికి ఆమె సమాధానమిస్తూ.. ఈ అంశం తమ పరిధిలోనిది కాదని, దీన్ని ఆర్‌బీఐ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.
డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువలో ఒడుదొడుకులు కనిపించినప్పటికీ.. ఇతర దేశాల కరెన్సీలతో పోలిస్తే మాత్రం బలంగా ఉందని సీతారామన్ తెలిపారు. అమెరికా ఫెడరల్ రిజర్వు నిర్ణయాల ప్రభావాన్ని ఇతర కరెన్సీల కంటే రూపాయే బలంగా ఎదుర్కోగలిగిందన్నారు. విదేశీ మారక నిల్వలపై వ్యక్తమవుతున్న ఆందోళనలపై స్పందిస్తూ.. రిజర్వుల్లో ఇంకా 500 బిలియన్ డాలర్లకుపైనే ఉన్నాయన్నారు. జులై 22 నాటికి 571.56 బిలియన్ డాలర్ల నిల్వలు ఉన్నాయన్నారు. ఇది చిన్న మొత్తమేమీ కాదన్నారు. ఈ విషయంలో భారత్‌కు ఎలాంటి ఢోకా లేదని ధీమా వ్యక్తం చేశారు.
బ్యాంకుల నుంచి నగదు విత్ డ్రాకు నో జీఎస్టీ: బ్యాంకుల నుంచి నగదు విత్‌డ్రా చేస్తే ఎలాంటి జీఎస్టీ ఉండదని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టంచేశారు. ప్రింటర్ నుంచి బ్యాంకులు కొనుగోలు చేసే చెక్‌బుక్‌లపైనే జీఎస్టీ ఉంటుందన్న ఆమె.. వినియోగదారుల చెక్‌బుక్‌లపై పన్ను ఉండదన్నారు. దేశంలో ధరల పెరుగుదల అంశంపై రాజ్యసభలో మంగళవారం జరిగిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా ఆమె సమాధానం ఇచ్చారు. ముందుగా ప్యాక్ చేసి లేబుల్ వేసిన ఆహార పదార్థాలపై 5శాతం జీఎస్టీ విధించే ప్రతిపాదనకు జీఎస్టీ కౌన్సిల్‌లో అన్ని రాష్ట్రాలూ అంగీకరించాయని.. ఆ ప్రతిపాదనకు ఒక్కరు కూడా వ్యతిరేకంగా మాట్లాడలేదన్నారు. ఆస్పత్రి పడకలు/ఐసీయూలకు జీఎస్టీ లేదన్న ఆమె.. రోజుకు రూ.5000 అద్దె చెల్లించే గదులకు మాత్రమే జీఎస్టీ విధించినట్టు తెలిపారు.
పేదలు వినియోగించే ఏ వస్తువు పైనా పన్ను విధించలేదన్న నిర్మలా సీతారామన్.. ముందుగా ప్యాక్ చేసి లేబుల్ వేసిన వస్తువులపైనే 5 శాతం జీఎస్టీ విధిస్తున్నాం తప్ప విడిగా విక్రయిస్తే ఎలాంటి పన్నూ ఉండదని తెలిపారు. ప్రతీ రాష్ట్రం తృణధాన్యాలు, పప్పులు, పెరుగు, లస్సీ, మజ్జిగ వంటి కొన్ని ఆహార పదార్థాలపై పన్ను విధించాయంటూ ఆహార పదార్థాలపైనా తాజాగా కేంద్రం జీఎస్టీ విధించడాన్ని సమర్థించుకున్నారు. శ్మశానవాటికలకు జీఎస్టీ లేదని.. కొత్త శ్మశానవాటికల నిర్మాణంపై మాత్రం పన్ను ఉంటుందని స్పష్టంచేశారు. ఇతర దేశాల్లో ద్రవ్యోల్బణాన్ని పోల్చుతూ ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాల వల్లే భారత్‌లో ద్రవ్యోల్బణం రేటు 7శాతంగా ఉందన్నారు. ధరల పెరిగాయన్నది ఎవరూ కాదనలేని అంశమని.. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు కేంద్రం తన వంతు కృషిచేస్తోందన్నారు.
తృణమూల్ ఎంపీలు వాకౌట్.. ధరలు పెరుగుదల, ద్రవ్యోల్బణం అంశంపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం ఇస్తుండగా ప్రశ్నలు లేవనెత్తేందుకు తమ నేతకు అనుమతించకపోవడం తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు నిరసన వ్యక్తంచేశారు. ఆమె సమాధానం ఇస్తుండగానే రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు.
ఇవీ చదవండి: దిగ్గజ సంస్థల చూపు భారత్‌వైపు.. భారీగా పెట్టుబడులు!
ముగిసిన 5జీ స్పెక్ట్రమ్ వేలం.. రూ.1.50లక్షల కోట్ల బిడ్లు.. జియో టాప్