stock market crash: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల పవనాలు, అమెరికా ఫెడ్ నిర్ణయాలు, ద్రవ్యోల్బణం, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణలతో దేశీయ మార్కెట్లు సోమవారం భారీగా పతనమయ్యాయి. బెంచ్‌మార్క్ సూచీలు దాదాపు 2.5 శాతానికిపైగా పడిపోవటం వల్ల ఒక్కరోజులోనే మదుపరుల సంపద దాదాపు రూ.7 లక్షల కోట్లు ఆవిరైంది. సెన్సెక్స్ ఏకంగా 1450 పాయింట్లకుపైగా నష్టపోయింది. నిఫ్టీ 16వేల దిగువకు చేరింది.
America fed rate news: అమెరికాలో ద్రవ్యోల్బణం 40 ఏళ్ల గరిష్ఠానికి చేరి 8.6గా నమోదైంది. దీంతో ఫెడరల్ రిజర్వ్ మరింత కఠినంగా వ్యవహరించే అవకాశం ఉందన్న అనుమానాలతో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. గత సెషన్లో బీఎస్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.251.8 లక్షల కోట్లుగా ఉండగా.. అది సోమవారం మధ్యాహ్నానికి రూ.245 లక్షల కోట్లకు పడిపోయింది. మే 30 నుంచి ఇప్పటి వరకు దాదాపు రూ.13.6 లక్షల కోట్లు మదుపరుల సంపద ఆవిరైంది.
- ముంబయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్.. 1457 పాయింట్ల నష్టంతో.. 52,847 వద్ద స్థిరపడింది.
ఇంట్రాడేలో సోమవారం 53,185 వద్ద ప్రారంభమైన సూచీ ఆది నుంచే నష్టాల్లోకి జారుకుంది. ఏ దశలోనూ కోలుకున్న దాఖలాలు లేవు. ఒకానొక దశలో 52,527 పాయింట్లకు పడిపోయిన సూచీ కాస్త కోలుకుని.. 52,847 వద్ద స్థిరపడింది. - జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ..427 పాయింట్లు కోల్పోయి..15,774 వద్ద ముగిసింది.
ఇంట్రాడేలో.. 15,877 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచీ ఒక దశలో 15,886 పాయింట్ల గరిష్ఠ, 15,684 పాయింట్ల కనిష్ఠ స్థాయులను తాకింది. చివరకు 15,774 పాయింట్ల వద్ద స్థిరపడింది.
లాభనష్టాల్లోనివి.. బీఎస్ఈ 30 ఇండెక్స్‌లో కేవలం నెస్లే మాత్రమే లాభాల్లో ముగియగా.. అన్ని సంస్థలు నష్టాలను మూటగట్టుకున్నాయి. బజాజ్‌ఫిన్‌సర్వ్, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్‌ఫైనాన్స్, టెక్‌మహీంద్ర 5 శాతానికిపైగా నష్టపోయాయి. టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్ 4శాతానికిపైగా, ఎన్టీపీసీ, ఎస్బీఐఎన్, ఎల్టీ, ఎమ్అండ్ ఎమ్, విప్రోలు 3 శాతానికిపైగా నష్టాల్లో ముగిశాయి.
తొలిసారి 78 మార్క్ దాటిన రూపాయి rupee depreciation: అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ భారీగా పతనమైంది. స్టాక్ మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణతో రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే.. 78 దిగువకు చేరింది. చరిత్రలో తొలిసారి 78 మార్క్‌ను దాటింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్లో సోమవారం 78.14 వద్ద ప్రారంభమైంది. ఆ తర్వాత మరింత దిగజారి 78.23కు పడిపోయింది. ఇటీవల ముడి చమురు ధరలు పెరగటం సైతం రూపాయి పతనానికి కారణమైంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు దాదాపు 120 డాలర్లుగా పలుకుతోంది. చముర ధరలు భారీగా పెరగటం వల్ల వాణిజ్యం లోటు పెరిగి దేశాల కరెన్సీ విలువ పడిపోతుంది.
ఇదీ చూడండి: జీవిత ప్రయాణం సాఫీగా సాగాలంటే.. ఆర్థిక ప్రణాళిక వేసుకోండిలా...