కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకుల మధ్య ట్రేడయ్యి చివరకు మిశ్రమంగా ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజీ సెన్సెక్స్ 158 పాయింట్లు లాభపడి 59,708 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీ నిఫ్టీ 39 పాయింట్ల నష్టంతో 17,616 దగ్గర స్థిరపడింది. టీసీఎస్, విప్రో, ఏషియన్ పెయింట్స్, హెచ్‌సీఎల్, నెస్లే ఇండియా, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు లాభపడగా.. టైటాన్, ఎంఅండ్‌ఎం, భారతీఎయిర్‌టెల్, యాక్సిస్ బ్యాంకు, టాటా మోటార్స్, సన్‌ఫార్మా షేర్లు నష్టపోయాయి.
బడ్జెట్‌పై ఆశలతో బుధవారం ఉదయం ఉత్సాహంగా ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. బడ్జెట్ ప్రసంగం వేళ ఆ జోరును అలాగే కొనసాగించాయి. ఆ తర్వాత ఒకానొక దశలో సెన్సెక్స్ 1,200 పాయింట్లకు పైగా లాభపడింది. ఆదాయ పన్ను విధానంలో మార్పులు, మూలధన పెట్టుబడులకు కేటాయింపులు పెంచడం మదుపర్లను ఉత్సాహరించింది. కానీ, ఆ జోరు చివరి వరకు నిలవలేదు. గరిష్ఠాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడం వల్ల సూచీలు కిందకు దిగొచ్చాయి.
- సెన్సెక్స్ 60,001 వద్ద లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 60,773- 58,816 మధ్య కదలాడింది. చివరకు 158.18 పాయింట్ల లాభంతో 59,708.08 దగ్గర స్థిరపడింది.
- నిఫ్టీ 17,811 వద్ద ట్రేడింగ్ ప్రారంభించి ఇంట్రాడేలో 17,972- 17,353 మధ్య ట్రేడయ్యింది. చివరకు 45.85 పాయింట్ల నష్టంతో 17,616 వద్ద ముగిసింది.
- మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 81.88 వద్ద నిలిచింది.