Stock Market Close: రష్యా- ఉక్రెయిన్ శాంతి చర్చలతో దేశీయ స్టాక్ మార్కెట్లు దూసుకెళ్లాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 740 పాయింట్లు పెరిగి 58 వేల 684 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 173 పాయింట్ల లాభంతో 17 వేల 498 వద్ద సెషన్‌ను ముగించింది. ఆరంభం నుంచి సూచీలు లాభాల్లోనే కదలాడాయి. సెన్సెక్స్ దాదాపు 400 పాయింట్ల లాభంతో ప్రారంభమైంది. 58 వేల 176 వద్ద కనిష్ఠాన్ని తాకిన సూచీ.. మళ్లీ భారీగా పెరిగి 58 వేల 728 వద్ద సెషన్ గరిష్ఠాన్ని నమోదుచేసింది. కొద్దిరోజులుగా రాణిస్తున్న లోహ రంగం షేర్లు ఇవాళ 3 శాతం మేర కుదేలయ్యాయి. ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ ఒక శాతం పడిపోయింది.
లాభనష్టాల్లో: ఆటో, ఐటీ, బ్యాంకింగ్, రియాల్టీ రంగం షేర్లు పుంజుకున్నాయి. హెచ్డీఎఫ్సీ ట్విన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి దిగ్గజ షేర్లలో కొనుగోళ్లతో మార్కెట్లు ముందుకెళ్లాయి. బజాజ్ ఫిన్సర్వ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, బజాజ్ ఫినాన్స్, హీరో మోటోకార్ప్ భారీ లాభాలు నమోదుచేశాయి. ఓఎన్జీసీ, హిందాల్కో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఐటీసీ, టాటా స్టీల్ నష్టపోయాయి. ఆసియా మార్కెట్లలో కూడా సియోల్, షాంఘై, హాంకాంగ్ సూచీలు లాభపడగా.. టోక్యో సూచీ నిక్కీ మాత్రం నష్టపోయింది. ఐరోపా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతుండగా.. గత సెషన్లో అమెరికా మార్కెట్లు కూడా 2-3 శాతం మేర పెరిగాయి.
రాజీ దిశగా: దాదాపు నెలరోజులకుపైగా కొనసాగుతున్న ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో కీలక ముందడుగు పడింది. రాజీ దిశగా ఇరు దేశాలు ఓ ముందడుగు వేశాయి. అంతర్జాతీయ శాంతి ఒప్పందానికి మొగ్గు చూపాయి. ఉక్రెయిన్ రాజధాని కీవ్, ఉత్తర ప్రాంత నగరం చెర్నిహైవ్ సమీపంలో తమ సైనిక కార్యకలాపాలు తగ్గించుకునేందుకు రష్యా సంసిద్ధత ప్రకటించింది. టర్కీలోని ఇస్తాంబుల్‌లో మంగళవారం ఇరుదేశాల ప్రతినిధుల మధ్య మూడు గంటలపాటు కొనసాగిన చర్చలు చాలా వరకు ఫలప్రదమయ్యాయి. ఇది మార్కెట్ల లాభాలకు ప్రధాన కారణం.
ఇవీ చూడండి: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో ఇలా..