RBI Monetary Policy Review : పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు వడ్డీ రేట్లు పెంచేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కూడా సిద్ధం అవుతోంది. బుధవారం ప్రారంభమయ్యే ద్రవ్య పరపతి సమీక్షలో తీసుకునే నిర్ణయాలను శుక్రవారం వెల్లడిస్తారు. అమెరికా, ఐరోపా దేశాల్లో ద్రవ్యోల్బణ నియంత్రణకు వడ్డీరేట్లు పెంచుతున్నందున, మాంద్యం చుట్టుముడుతుందనే భయాలు వ్యక్తమవుతున్నాయి. భారత్‌లోనూ 8 నెలలుగా ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ లక్షిత 6 శాతానికి మించే కొనసాగుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం మే లో 40 బేసిస్ పాయింట్లు, జూన్ - ఆగస్టుల్లో మరో 50 బేసిస్ పాయింట్ల చొప్పున ఆర్‌బీఐ రెపో రేటును పెంచింది. ఫలితంగా రెపో రేటు 5.40 శాతానికి చేరింది. తాజా సమీక్షలో మరో 50 బేసిస్ పాయింట్లు పెంచితే, ఇది 5.90 శాతం అవుతుంది.
ద్రవ్యోల్బణమే శత్రువు: మన దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం ఆర్థిక వ్యవస్థకు ఇబ్బంది కలిగిస్తోంది. రుణాల జారీ పెరగడంతో, బ్యాంకుల దగ్గర నగదు నిల్వలు తగ్గుతున్నాయి. 'నిధుల సమీకరణకు ప్రత్యేక డిపాజిట్ పథకాలను ప్రవేశ పెట్టినా, అంత ఆకర్షణీయ ప్రతిఫలం లభించడం లేదంటూ ఎక్కువమంది ముందుకు రావడం లేదు. ఈ పరిస్థితుల్లో ఆర్‌బీఐకి వడ్డీ రేటు పెంపు మినహా ప్రత్యామ్నాయం లేద'ని ఒక బ్యాంకింగ్ నిపుణుడు అభిప్రాయం వ్యక్తం చేశారు.
రూపాయి విలువా కీలకమే: అమెరికా డాలరుతో పోలిస్తే అంతకంతకూ పతనమవుతున్న రూపాయి విలువను కాపాడటం ఇప్పుడు ఆర్‌బీఐకి ముఖ్యం. వడ్డీ రేటును నిర్ణయించేందుకు దీన్ని ప్రాతిపదికగా తీసుకునే అవకాశం ఉంది. 'ద్రవ్యోల్బణం 7 శాతానికి మించి ఉంది. కమొడిటీస్, చమురు ధరలు తగ్గుతున్నందున, ద్రవ్యోల్బణ పరిస్థితులు చక్కబడతాయని ఆర్‌బీఐ భావిస్తే.. వడ్డీ రేటును 25-35 బేసిస్ పాయింట్ల వరకే పెంచే అవకాశం ఉంది. అయితే అంతర్జాతీయ పరిణామాలను పరిగణనలోనికి తీసుకుంటే మాత్రం 50 బేసిస్ పాయింట్ల పెంపు తప్పదేమో' అని బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకనమిస్ట్ మదన్ సబ్నవిస్ తెలిపారు.
బ్యాంకులు సిద్ధంగా: ఆర్‌బీఐ రెపో రేటు పెంచగానే దానికి అనుసంధానమైన రెపో ఆధారిత వడ్డీ రేటు (ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్) పెంచేందుకు బ్యాంకులు సిద్ధంగా ఉంటాయి. సెప్టెంబరు 30న రెపో రేటు పెంపు నిర్ణయం వెలువడగానే, అక్టోబరు 1 నుంచి కొత్త రేట్లు వసూలు చేసేందుకు బ్యాంకులూ సిద్ధం కావచ్చు. పండగల వేళ రుణాల గిరాకీ అధికమైనందున, నగదు సమీకరణ కోసం మరిన్ని ప్రత్యేక డిపాజిట్ పథకాలనూ బ్యాంకులు ప్రవేశ పెట్టొచ్చు.
వడ్డీ రేట్లు పెరుగుతున్న తరుణంలో చాలామంది దీర్ఘకాలిక డిపాజిట్లపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అందుకే బ్యాంకులు 400, 500, 550 రోజుల వ్యవధితో డిపాజిట్ పథకాలను తీసుకొస్తూ, 6-6.5 శాతం వడ్డీని ప్రకటిస్తున్నాయి. రుణ రేట్లను పెంచినప్పటికీ.. పండగల వేళ రుణదాతలను ఆకట్టుకునేందుకు కొన్ని ప్రత్యేక రాయితీలను/రుసుముల రద్దు వంటి ప్రయోజనాలను బ్యాంకులు కల్పించే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: వాహన బీమా పాలసీలో కొత్త టెక్నాలజీ.. తక్కువ ప్రీమియంతోనే..