ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ ఫిలిప్స్ ఉద్యోగుల తొలగింపు జాబితాలో చేరింది. 6వేల ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. తమ సంస్థ తయారు చేసిన వైద్య పరికరాల్లో లోపాన్ని గుర్తించడం వల్ల వాటిని రీకాల్ చేసినట్లు తెలిపింది. ఆ నష్టాలను పూడ్చుకోవడానికే ఉద్యోగుల తొలగింపు నిర్ణయం తీసుకున్నట్లు ఫిలిప్స్ సీఈఓ రాయ్ జాకబ్స్ ప్రకటించారు. తమ పనితీరును మెరుగుపర్చుకోవడానికి, ఉత్పాదకతను పెంచుకోవడానికి ఉద్యోగుల తొలగింపు తప్పట్లేదని జాకబ్స్ తెలిపారు. కఠిన నిర్ణయమైనా సంస్థ అభ్యున్నతి కోసం ఉద్యోగుల తొలగింపు అనివార్యమైందని వెల్లడించారు. 2025 నాటికి 6 వేల మంది ఉద్యోగులను లే ఆఫ్ చేయనున్నట్లు తెలిపారు. ఈ ఏడాదే సుమారు 3 వేల మందిని తొలగించనున్నట్లు చెప్పారు. వైద్య పరికరాల రీకాల్ కారణంగా ఫిలిప్స్ సంస్థ గతేడాది 1.6 బిలియన్ యూరోల నష్టాన్ని చవిచూసింది.
స్లీప్ ఆప్నియా అనే వ్యాధికి ఫిలిప్స్ సంస్థ స్లీప్ రెస్పిరేటర్స్ అనే పరికరాన్ని తయారు చేసింది. అయితే ఈ మెషిన్లలలో లోపాల కారణంగా రోగులు క్యాన్సర్ కారక ప్రభావాలకు గురయ్యే ప్రమాదం ఉందని వార్తలు గుప్పుమన్నాయి. వైద్య పరికరాల్లో లోపాలపై అమెరికా న్యాయస్థానాల్లో ఫిలిప్స్ సంస్థకు వ్యతిరేకంగా అనేక వ్యాజ్యాలు దాఖలయ్యాయి. దీంతో ఆ సంస్థ వైద్య పరికరాలను వెనక్కి తీసుకుంది. మూడు నెలలో క్రితమే ఫిలిప్స్ సంస్థ 4 వేల ఉద్యోగులను తొలగించగా.. ఇప్పుడు మరో 6 వేల మందికి ఉద్వాసన పలకునుండట వల్ల మొత్తం 10 వేల మందిని తొలగించునున్నట్లు స్పష్టమవుతోంది. 30 ఏళ్ల క్రితం బల్బులు తయారీ కంపెనీగా తన ప్రస్థానం ప్రారంభించిన ఫిలిప్స్.. కొన్నేళ్ల క్రితం పలు మార్పులకు గురై వైద్య పరికరాల తయారీకి అధిక ప్రాధాన్యమివ్వడం ప్రారంభించింది.