OLA CAR: ఆగస్టు 15న కొత్త ప్రోడక్ట్‌ను ఆవిష్కరించనున్నట్లు ప్రముఖ విద్యుత్తు వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవీష్ అగర్వాల్ ట్వీట్ చేశారు. దీంతో అదేంటా అని ఆటో వర్గాల్లో ఆసక్తి వ్యక్తమవుతోంది. గతేడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఓలా ఎలక్ట్రిక్ తమ తొలి స్కూటర్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈసారి తమ విద్యుత్తు కారు ఆవిష్కరించే అవకాశం ఉందని సర్వత్రా చర్చ జరుగుతోంది. ఆరోజు తమ కంపెనీ భవిష్యత్తు ప్రణాళికలను కూడా ప్రకటిస్తామని భవీష్ ట్వీట్‌లో పేర్కొన్నారు.
కార్ల తయారీ రంగంలోకి తాము ప్రవేశించనున్నట్లు భవీష్ కొన్ని నెలల క్రితమే ప్రకటించారు. ఈ క్రమంలో జూన్‌లో ఓలా తమ కారుకి సంబంధించిన టీజర్‌ను ట్వీట్ చేసింది. వెనుక, ముందు భాగం డిజైన్‌లను అందులో బహిర్గతం చేసింది. ఓలా అలే లోగో కూడా అందులో కనిపించింది. డిజైన్‌ను బట్టి సెడాన్ సెగ్మెంట్‌లో ఈ కారును విడుదల చేసే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు. ఇప్పటికే కార్ల తయారీ కేంద్రం ఏర్పాటుకు కావాల్సిన ఓలా 1,000 ఎకరాల స్థలం కోసం వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలతో కంపెనీ చర్చలు జరుపుతోంది.
ఇవీ చదవండి: గుడ్‌న్యూస్.. మరింత తగ్గనున్న వంటనూనె ధరలు!