Maruti Suzuki Cars Price: భారత విపణిలోని వివిధ కార్ల తయారీ సంస్థలు వాహనాల ధరలను పెంచుతున్నట్లు ఇటీవల ప్రకటించాయి. తాజాగా ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా కూడా ఇదే జాబితాలో చేరింది. తమ సంస్థకు చెందిన అన్ని మోడళ్ల కార్లపై 0.9 శాతం నుంచి 1.9 శాతం వరకు ధరల పెంపును తక్షణం అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. పెట్టుబడి వ్యయం పెరిగిన కారణంగానే ధరలను పెంచాల్సి వచ్చిందని వెల్లడించింది. సోమవారం ఇవి అమలులోకి రాగా.. ఎక్స్‌షోరూం ధర (దిల్లీలో) వివిధ మోడళ్లపై సగటున 1.3 శాతం పెరిగింది.
పెట్టుబడి వ్యయం పెరిగిందన్న కారణంతో గతేడాది జనవరి నుంచి ఈ ఏడాది మార్చి మధ్య మారుతీ సంస్థ ధరలను 8.8 శాతం పెంచింది. స్టీల్, అల్యూమీనియం, కాపర్ వంటి లోహాల ధరలు పెరగడమే ఇందుకు కారణమని సంస్థ వెల్లడించింది. గత వారం మహీంద్ర అండ్ మహీంద్ర సంస్థ కూడా తమ వాహనాల ధరలను 2.5 శాతం (దాదాపు రూ.63,000) పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈనెల 1వ తేదీన టొయోటా సంస్థ కూడా తమ కార్లపై 4 శాతం ధరల పెంపును అమలు చేసింది. ప్రీమియం కార్ల సంస్థలు ఆడీ, మెర్సిడిజ్ బెంజ్, బీఎండబ్ల్యూ కూడా ఇటీవల ధరలను పెంచాయి.
BMW X4 Silver Shadow Edition: ప్రముఖ లగ్జరీ కార్ల సంస్థ బీఎండబ్ల్యూ తన ఎక్స్4 మోడల్ కారు కొత్త ఎడిషన్‌ను ప్రవేశపెట్టింది. సిల్వర్ షాడో ఎడిషన్ పేరుతో మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చిన ఈ కారు ధర రూ. 71.9 లక్షలు (ఎక్స్ షోరూం) నుంచి ప్రారంభమవుతుంది. చెన్నైలో ఉత్పత్తి చేసిన ఈ కార్లు రెండు రకాల ఇంజిన్లతో అందుబాటులో ఉన్నాయి. రెండు లీటర్ల ఇంజిన్ ఉండే పెట్రోల్ వేరియంట్‌కు 252 హార్స్‌పవర్‌తో పవర్ఫుల్ ఇంజిన్‌ను అందుబాటులోకి తెచ్చారు. కేవలం 6.6 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.
మరోవైపు డీజిల్ వేరియంట్‌కు 265 హార్స్‌పవర్‌తో మూడు లీటర్ల పవర్ఫుల్ ఇంజిన్‌ను కేటాయించారు. ఇది పెట్రోల్ వేరియంట్ కన్నా వేగంగా దూసుకెళ్తుంది. కేవలం 5.8 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకునేలా దీనిని తయారు చేశారు. దీని ధర రూ.73.9 లక్షల (ఎక్స్‌షోరూం) నుంచి ప్రారంభమవుతుంది. ఈ కార్లను ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చని బీఎండబ్ల్యూ సంస్థ తెలిపింది.
Audi A8 Long Wheelbase: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల సంస్థ ఆడీ.. ఏ8 మోడల్లో కొత్త వెర్షన్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది. ఏ8 లాంగ్ వీల్‌బేస్ పేరుతో ప్రవేశపెట్టనున్న ఈ కారు మరికొన్ని వారాల్లో కొనుగోళ్లకు అందుబాటులోకి వస్తుంది. 3 లీటర్ల పెట్రోల్ ఇంజిన్‌తో అందుబాటులోకి వచ్చే ఈ కారు ధర, మొదలైన వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ ఏడాదిలో ఆడీ కొత్త వెర్షన్ కార్లను ప్రవేశపెట్టడం ఇది రెండోసారి. ఫిబ్రవరిలో క్యూ7 అనే ఎస్యూవీ మోడల్‌ను భారత విపణిలోకి ప్రవేశపెట్టింది. రూ.79.99 లక్షలు (ఎక్స్‌షోరూం) నుంచి ఈ కారు ధర ప్రారంభమవుతుంది.
ఇదీ చూడండి : డిజిటల్ చెల్లింపుల్లో యూపీఐ టాప్.. ఐదేళ్లలో మరింత వృద్ధి