LPG Gas Cylinder Insurance : మన ఇంట్లో వంట కోసం ఎల్‌పీజీ సిలిండర్ వాడుతుంటాం. ప్రభుత్వం ఎప్పుడైనా సబ్సిడీలు ప్రకటిస్తే, దానిని చూసి చాలా సంతోషిస్తూ ఉంటాం. అయితే గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు కాంప్లిమెంటరీగా రూ.50 లక్షల బీమా వస్తుందని మీకు తెలుసా?
గ్యాస్ సిలిండర్ వినియోగదారులు అందరికీ కేంద్ర ప్రభుత్వం ఉచితంగా రూ.50 లక్షల బీమాను కల్పిస్తుంది. గ్యాస్ సిలిండర్ బుక్ చేయగానే, సదరు కుటుంబానికి ఈ బీమా కవరేజ్ లభిస్తుంది. ఇందుకోసం వినియోగదారులు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన పనిలేదు.
ప్రమాదం సంభవిస్తే
గ్యాస్ సిలిండర్లు పేలితే భారీ స్థాయిలో ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవిస్తాయి. అందుకే కేంద్ర ప్రభుత్వం చమురు కంపెనీల ద్వారా బాధిత కుటుంబాలకు పరిహారం అందజేస్తుంది. దీని వల్ల గ్యాస్ ప్రమాదాలు జరిగినప్పుడు బాధిత కుటుంబాలకు ఆర్థికంగా ఆసరా లభిస్తుంది. అందువల్ల ఎల్‌పీజీ వినియోగదారులు, తమ కుటుంబం కోసం పెట్రోలియం కంపెనీల నుంచి రూ.50 లక్షల వరకు బీమా సొమ్మును క్లెయిమ్ చేసుకోవచ్చు.
ఇన్సూరెన్స్ బెనిఫిట్స్
- గ్యాస్ సిలిండర్ పేలుడు జరిగినప్పుడు ఒక్కో సభ్యుడికి రూ.10 లక్షలు చొప్పున పరిహారం లభిస్తుంది.
- మొత్తం కుటుంబానికి గరిష్టంగా రూ.50 లక్షల వరకు ఇన్సూరెన్స్ అందుతుంది.
- గ్యాస్ ప్రమాదంలో కేవలం ఆస్తి నష్టం మాత్రమే జరిగితే రూ.2 లక్షల వరకు బీమా లభిస్తుంది.
- ఒక వేళ ప్రమాదంలో ఎవరైనా మరణిస్తే, వ్యక్తిగత ప్రమాద బీమా కవరేజ్ కింద రూ.6 లక్షలు వస్తుంది.
- చికిత్స కోసం ఒక్కో సభ్యుడికి రూ.2 లక్షలు చొప్పున అందుతుంది. ఒక కుటుంబం మొత్తానికి గరిష్టంగా రూ.30 లక్షల వరకు బీమా సొమ్ము లభిస్తుంది.
సిలిండర్ తీసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు!
ఎల్‌పీజీ సిలిండర్ తీసుకునేటప్పుడు కచ్చితంగా ఎక్స్‌పైరీ డేట్‌ను చెక్ చేసుకోవాలి. సిలిండర్ పైభాగంలో కోడ్ రూపంలో ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. ఈ కోడ్‌లో A-24, B-25, C-26, D-27 లాంటి అక్షరాలు-సంఖ్యలు ఉంటాయి. ఈ కోడ్‌లో A అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి; B అంటే ఏప్రిల్, మే, జూన్; C అంటే జూలై, ఆగస్టు, సెప్టెంబర్; D అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలు అని గుర్తించాలి. ఇక పక్కన ఉన్న రెండు అంకెల సంఖ్యను ఈ శతాబ్దంలోని ఒక సంవత్సరంగా గుర్తించాలి. ఉదాహరణకు A-23 అంటే, 2023వ సంవత్సరంలోని జనవరి- మార్చితో దాని ఎక్స్‌పైరీ డేట్ అయిపోయినట్లు అర్థం చేసుకోవాలి. ఈ సమయంలోనే డీలర్ సదరు సిలిండర్‌ను సర్వీస్‌కు ఇవ్వాలి. లేదా పూర్తిగా మార్చాలి. మీకు గనుక ఇలాంటి పాత సిలిండర్‌ను ఇస్తే, వెంటనే దానిని తిరస్కరించి, కొత్త సిలిండర్ ఇవ్వమని అడగాలి.
ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రాసెస్
గ్యాస్ సిలిండర్ పేలి ప్రమాదం జరిగిన వెంటనే, సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు, ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్‌కు సమాచారం అందించాలి. వారు ప్రమాద ఘటనపై పూర్తిగా విచారణ చేస్తారు. ఎల్‌పీజీ సిలిండర్ పేలడం వల్లనే ఘటన జరిగిందని నిర్ధరణ అయితే, ఆ విషయాన్ని సంబంధిత ఆయిల్ కంపెనీకి, ఇన్సూరెన్స్ కంపెనీకి డిస్ట్రిబ్యూటర్ సమాచారం అందిస్తారు. ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ చూసిన తరువాత, బీమా కంపెనీ మీకు ఆటోమేటిక్‌గా పరిహారం అందిస్తుంది. ఇందుకోసం బాధితులు నేరుగా కంపెనీతో సంప్రదించాల్సిన అవసరం కూడా ఉండదు. అయితే మరణ ధ్రువీకరణ పత్రం, పోస్ట్ మార్టం నివేదిక, వైద్య బిల్లులు, డాక్టర్ ప్రిస్క్రిప్షన్లు, డిశ్చార్జ్ కార్డులను మాత్రం సమర్పించాల్సి ఉంటుంది.
మీ ఆర్థిక లక్ష్యాన్ని నెరవేర్చే టాప్-10 లాంగ్‌టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఇవే!
హెల్త్ ఇన్సూరెన్స్‌లో "నో క్లెయిమ్ బోనస్" గురించి తెలుసా? - లేదంటే మీకు చాలా నష్టం!