LIC IPO: అందరూ ఎదురుచూస్తున్న ఎల్‌ఐసీ మెగా పబ్లిక్ ఇష్యూ రానే వచ్చింది. నేటి నుంచే ఇష్యూకు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 9 వరకు అందుబాటులో ఉంటుంది. సోమవారం యాంకర్ ఇన్వెస్టర్లకు కేటాయించిన భాగానికి అధిక స్పందన రావడం విశేషం. ఈ నేపథ్యంలో రిటైల్ మదుపర్లు, పాలసీదార్లు, తొలిసారి పబ్లిక్ ఇష్యూకు దరఖాస్తు చేసుకుంటున్న వారూ ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. పబ్లిక్ ఇష్యూ ధరల శ్రేణి రూ.902-949గా ప్రకటించారు. అయితే పాలసీదార్లకు రూ.60; రిటైలర్లు, ఉద్యోగులకు రూ.45 చొప్పున డిస్కౌంటు ఇస్తున్నారు.
చాలా వరకు విశ్లేషకులు ఈ ఐపీఓపై బులిష్‌గానే ఉన్నారు. 30 కోట్ల వరకు పాలసీదార్లు; 13 లక్షల మంది ఏజెంట్లు ఉన్న ఈ సంస్థకు మొత్త బీమా ప్రీమియంలో (2020-21) 64 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. 2019-20లో రూ.5.7 లక్షల కోట్ల ప్రీమియం ఆదాయంతో భారత బీమా మార్కెట్ రికార్డు సృష్టించింది. ఇందులో ఎల్‌ఐసీకి రూ.3.8 లక్షల కోట్ల ఆదాయం దక్కింది. 'ఈ ఐపీఓకి దరఖాస్తు చేయొచ్చు. అయితే స్వల్పకాలానికి కాదు.. దీర్ఘకాలాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఏడాది తర్వాత మళ్లీ వాటా విక్రయం ఉండొచ్చు. కాబట్టి వేచి ఉండాలి' అని జీసీఎల్ సెక్యూరిటీస్ వైస్ ఛైర్మన్ రవి సింఘాల్ అంటున్నారు.
ఇతర నమోదిత బీమా కంపెనీలతో పోలిస్తే ఎల్‌ఐసీ ఐపీఓ ధర సహేతుకంగానే ఉందని విశ్లేషకులు అంటున్నారు. రూ.902-949 ధర వద్ద ఐపీఓ విలువను చూస్తుంటే.. 2021-22 ప్రైస్ టు ఎంబెడెడ్ వేల్యూ(పీ/ఈవీ) విలువకు 1.1 రెట్లు ఉంది. మొత్తం మీద ఆకర్షణీయ విలువలు, భారీ ఆస్తులు, బలమైన బ్రాండ్ విలువ తదితరాల వల్ల ఐపీఓకు మొగ్గుచూపొచ్చని ఎక్కువమంది మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.
ఇదీ చూడండి: ఐపీఓ చరిత్రలో ఎల్‌ఐసీనే టాప్.. తరువాత స్థానాల్లో ఏవంటే..