గత కొంతకాలంగా కొండెక్కి కూర్చున్న బంగారం, వెండి ధరలు కాస్త దిగి వచ్చినట్లుగా కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ పరిస్థితులు, డాలర్ విలువ ఈ ధరలను ప్రభావితం చేస్తాయి. ఏప్రిల్‌లో కూడా బంగారానికి గిరాకీ తక్కువగానే ఉందని అమ్మకందారులు చెబుతున్నారు. బంగార ధరలు బాగా పెరిగిన తరుణంలో.. వినియోగదారులు వాటిని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) తన నివేదికలో పేర్కొంది. తమ వద్ద ఉన్న పాత అభరణాలను మార్చుకుని, కొత్తవి తీసుకుంటున్నారని ఈ నివేదిక వెల్లడించింది.
బంగారం, వెండి ధరలు ఎన్నడూ లేనంత భారీగా పెరిగిన కారణంగా మన దేశ మహిళలకు.. ఇది కాస్త ఇబ్బందికరంగానే మారింది. దీంతో ప్రతి శుభకార్యానికి.. ఎంతో కొంత బంగారం కొనే మహిళలకు వాటి పట్ల ఆసక్తి సన్నగిల్లింది. పాశ్చాత్య దేశాల ప్రజలు బంగారం, వెండిని లోహపు రూపంలో కొనుగోలు చేసేందుకు తక్కువ ఆసక్తి చూపుతారు. ఎక్కువగా పెట్టుబడి రూపంలో పెట్టేందుకు ఇష్టపడతారు. భారత్‌లోనూ బంగారం-వెండి ఫ్యూచర్ కాంట్రాక్టులు కొనుగోలు చేసి, కాస్త లాభానికి అమ్ముకోవడం ఈ మధ్య పెరుగుతోంది.
అంతర్జాతీయంగా తక్కువగానే ఉన్నా..
అంతర్జాతీయంగాను బంగారం ధర కాస్త తక్కువగానే ఉంది. 2022 మార్చిలో ఔన్సు (31.10 గ్రాముల) బంగారం ధర 2052 డాలర్లు పలికింది. ఇప్పుడు ఆ ధర 1815 డాలర్లకు తగ్గింది. అప్పుడు డాలర్ విలువ రూ.76 కాగా.. ఇప్పుడు ఆ ధర రూ.82గా ఉంది. 2023 ఫ్రిబ్రవరిలో ఔన్సు బంగారం 1952 డాలర్లు. భారత్‌లో 10 గ్రాముల (999 స్వచ్ఛత) మేలిమి బంగారం ధర రూ.60,900కు చేరింది. ఫిబ్రవరి నుంచి అంతర్జాతీయంగా ఔన్సు బంగారం ధర 137 డాలర్లు తగ్గింది. దీంతో దేశంలో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.4000 వరకు తగ్గి, రూ.56900కు చేరుకుంది. కిలో వెండి ధర రూ.72,000 నుంచి రూ.8500 తగ్గి.. రూ.63,500లకు దిగి వచ్చింది.
ఇంకా తగ్గుతుంది..
బంగారం ధర గరిష్ఠ స్థాయికి చేరినప్పుడు చిన్న పట్టణాల్లో వాటి అమ్మకాలు.. ఆ ధర మేరకు జరగలేదని బులియన్ అసోసియేషన్ ప్రముఖులు తెలిపారు. ఆ సమయంలో గ్రాముకు రూ.270 చొప్పున తగ్గించి మరి పలు ప్రాంతాల్లో విక్రయాలు జరిపినట్లు వివరించారు. ఇప్పుడు కూడా బంగారం ధర మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు. అంతర్జాతీయంగానూ ఔన్సు బంగారం ధర మరో 40-50 డాలర్లు తగ్గవచ్చని చెబుతున్నారు. దీంతో దేశీయ విపణిలో కూడా 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.55,000 స్థాయికి చేరే అవకాశాలు ఉన్నాయని వారు వెల్లడించారు. వెండి కిలో రూ.61,000 వరకు తగ్గే అవకాశం ఉందని వివరించారు. ముంబయి బులియన్ వర్తకులూ ఇదే అంచనాతో ఉన్నారని వెల్లడించారు. అందువల్ల బంగారం, వెండి ధరలను నిత్యం గమనిస్తూ ఉండాలని చెబుతున్నారు. తాము అనుకున్న ధర వచ్చినప్పుడు మాత్రమే కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు.
బిల్లు లేకుండా కొనడం ప్రమాదకరమే..
బంగారం ధర ఎక్కువగా ఉన్న కారణంగా.. బిల్లు లేకుండా అయితే కొంత తక్కువకే ఆభరణాలు కొనొచ్చని కొందరు భావిస్తున్నారు. కొన్ని కార్పొరేట్ సంస్థలు బిల్లు లేకుండా అస్సలు అమ్మకాలు జరపవు. స్థానికంగా ఆభరణాలు అమ్ముకునే దుకాణదారులు మాత్రమే బిల్లు లేకుండా వాటిని విక్రయిస్తారు. బిల్లు లేకుండా కొంటే.. జీఎస్‌టీ రూపంలో కేవలం 3 శాతమే తగ్గుతుంది. ఈ లెక్కన రూ.లక్షకు కేవలం మూడువేల రూపాయలే మిగులుతాయి. బిల్లు లేకుండా ఆభరణాలు కొన్నట్లైతే బంగారం స్వచ్ఛతకు ఎటువంటి భద్రత ఉండదు. దుకాణదారుపై ఉన్న నమ్మకంతో ఆభరణాలు కొన్నా క్యారెట్ మీటర్‌తో పరీక్షించుకోవడం ఉత్తమం. లేదంటే 22 క్యారెట్లకు (916 స్వచ్ఛత) బదులుగా.. తక్కువ నాణ్యత ఉండే బంగారాన్ని విక్రయించే ప్రమాదం ఉంది. కాబట్టి బిల్లు లేకుండా కొనుగోలు చేస్తే.. వచ్చే లాభం కన్నా నష్టమే ఎక్కువగా జరిగే అవకాశం ఉంది.