Infosys defers pay hikes for employees : దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ తమ ఉద్యోగుల జీతాల పెంపును వాయిదా వేసింది. సాధారణంగా సీనియర్ మేనేజర్స్ కంటే దిగువ స్థాయి ఉద్యోగుల జీతాలను ప్రతి జూన్ త్రైమాసికంలో ఇన్ఫోసిస్ పెంచుతూ ఉంటుంది. కానీ ఈ సారి అలాంటి నిర్ణయమేదీ ఇంకా వెలువడలేదు.
ఆర్థిక భారమే కారణమా?
ఇన్ఫోసిస్ ఇటీవలి కాలంలో చాలా ఒడుదొడుకలను ఎదుర్కొంటూ ఉంది. కీలకమైన ప్రాజెక్టులు రద్దు కావడం లేదా ప్రాజెక్టులు పునఃసమీక్షకు లోనుకావడం జరుగుతోంది. దీని వల్ల ఇన్ఫోసిస్ కంపెనీపై చాలా ఆర్థిక భారం పడుతోంది. అందువల్లనే ఈ సారి తమ ఉద్యోగుల జీతాలను ఇన్ఫోసిస్ పెంచలేకపోయిందని మార్కెట్ వర్గాల సమాచారం.
క్లారిటీ ఇవ్వలేదు
ఇన్ఫోసిస్ ఉద్యోగులు కూడా తమకు ఎలాంటి శాలరీ హైక్ ప్రకటించలేదని చెబుతున్నారు. అలాగే కంపెనీ.. తమకు ఎప్పుడు జీతాలు పెంచుతుందనే విషయంలో కూడా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని అంటున్నారు.
సీనియర్ మేనేజర్లకూ లేదు!
salary hike in Infosys : ఇన్ఫోసిస్ సాధారణంగా సీనియర్ మేనేజర్లకు కూడా జులైలోనే జీతాలను పెంచుతూ ఉంటుంది. కానీ ఈ సారి వారికి కూడా ఎలాంటి శాలరీ హైక్ ప్రకటించలేదు.
కరోనా సమయంలో..
ఇన్ఫోసిస్ మొదటిసారిగా కరోనా సమయంలో తమ ఉద్యోగుల జీతాల పెంపును వాయిదా వేసింది. కానీ కరోనా పరిస్థితులు తగ్గిన తరువాత, 2021 జనవరిలో మళ్లీ ఉద్యోగుల జీతాలను పెంచింది.
రిజల్ట్స్ ఎలా ఉంటాయో!
ఇన్ఫోసిస్ తమ కంపెనీ మొదటి త్రైమాసిక ఫలితాలను ఈ జులై 20 నాటికి ప్రకటించాల్సి ఉంది. అయితే 2024 ఆర్థిక సంవత్సరానికి గాను తమ రెవెన్యూ గ్రోత్ 4-7 శాతం ఉండొచ్చని ఇది వరకే ఇన్ఫోసిస్ వెల్లడించింది.
డన్జో ఉద్యోగుల శాలరీపై పరిమితి విధింపు
Dunzo caps salaries : ప్రముఖ క్విక్ కామర్స్ కంపెనీ డన్జో .. తన ఉద్యోగుల జీతాలపై పరిమితి విధించిది. వాస్తవానికి జీతం ఎంత అయినప్పటికీ.. వారి నెలవారీ జీతాలను రూ.75,000లకే పరిమితం చేసింది. అయితే జూలై 20లోపు ఉద్యోగులకు చెల్లించాల్సిన పూర్తి వేతనం చెల్లిస్తామని ప్రకటించింది.
వరుస ఆర్థిక ఒడుదొడుకులే.. డన్జో ఉద్యోగుల జీతాలపై పరిమితి విధించడానికి కారణంగా తెలుస్తోంది. జూన్ నెలలో కంపెనీ తమ ఉద్యోగుల్లో కనీసం 50 శాతం మందికి జీతాల పెంపును వాయిదా వేసింది. చివరికి ఈ స్టార్టప్ కంపెనీ సీఈఓ కబీర్ బిస్వాల్ శాలరీపై కూడా పరిమితి విధించడం జరిగింది. ఇప్పటికి ఉన్న సమాచారం ప్రకారం, జూన్ నెలలో 60-65 శాతం మందికి ఫుల్ శాలరీ ఇవ్వగా.. 35-40 శాతం ఉద్యోగుల జీతాన్ని రూ.75,000కు మాత్రమే పరిమితం చేయడం జరిగింది.