పన్ను రిటర్నులు దాఖలు చేయడం సులభతరం చేసేందుకు ఆదాయ పన్ను విభాగం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూనే ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో పరిమితికి మించి ఆదాయం ఉన్నవారు.. నిబంధనల మేరకు నిర్ణీత ఐటీఆర్ ఫారంలో రిటర్నులు దాఖలు చేసేందుకు సమయం ఆసన్నమైంది. ఇప్పటికే ఇన్‌కంట్యాక్స్ వెబ్‌సైటులో ఫారాలు అందుబాటులో ఉన్నాయి. ముందుగానే నింపిన ఈ పత్రాలను ఒకసారి పరిశీలించి, రిటర్నుల ప్రక్రియను పూర్తి చేసేయొచ్చు. దీనికన్నా ముందు మన ఆదాయానికి సంబంధించిన ఆధారాలను సేకరించాలి. అందుకోసం ఏం చేయాలంటే..
ఫారం 16: యాజమాన్య సంస్థ తమ ఉద్యోగికి ఈ ఫారాన్ని జారీ చేస్తుంది. గత ఆర్థిక సంవత్సరం అంటే 2021-22లో మీరు ఆర్జించిన వేతనం, మూలం వద్ద విధించిన పన్ను (టీడీఎస్), పన్ను మినహాయింపుల కోసం మీరు క్లెయిం చేసుకున్న మొత్తం తదితర వివరాలతో ఇది ఉంటుంది. కొన్ని సంస్థలు ఇప్పటికే ఈ ఫారాలను జారీ చేశాయి. మరికొన్ని త్వరలోనే వీటిని అందిస్తాయి. ఫారం16లో వచ్చిన ఆదాయం, ఐటీఆర్‌లో ముందే నింపి ఉన్న మొత్తంతో సరిపోయిందా లేదా చూసుకోవాలి.
ఫారం 16ఏ: వేతనం కాకుండా.. ఇతర ఆదాయాలు ఆర్జించిన సందర్భంలో అక్కడ విధించిన టీడీఎస్‌లకు సంబంధించిన ఆధారం ఇది. ముఖ్యంగా బ్యాంకు డిపాజిట్లు ఉన్నప్పుడు రూ.40వేలకు మించి వడ్డీని ఆర్జించినప్పుడు టీడీఎస్ విధిస్తారు. ఇలాంటి సందర్భాల్లో ఫారం 16ఏను ఇస్తారు. మ్యూచువల్ ఫండ్ సంస్థలు రూ.5,000 మించి డివిడెండ్ చెల్లించినప్పుడు ఈ ఫారం జారీ చేస్తాయి.
వడ్డీ ఆధారాలు: బ్యాంకులు, పోస్టాఫీసులు ఇతర ఆర్థిక సంస్థలలో చేసిన డిపాజిట్లపై వచ్చిన వడ్డీ తాలూకు ఆధారాలను సేకరించండి. ఐటీఆర్‌లో ఆయా వడ్డీలను విడివిడిగా చూపించాల్సి ఉంటుంది. పొదుపు ఖాతా, ఫిక్స్‌డ్ డిపాజిట్ల ద్వారా వచ్చిన వడ్డీకి నిబంధనల మేరకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. సెక్షన్ 80టీటీఏ ప్రకారం పొదుపు ఖాతాపై ఆర్జించిన రూ.10వేల వరకూ వడ్డీకి పన్ను మినహాయింపు క్లెయిం చేసుకోవచ్చు. అంతకు మించి వచ్చినప్పుడు మొత్తం ఆదాయంలో కలిపి చూపించి, వర్తించే శ్లాబుల ప్రకారం పన్ను చెల్లించాల్సి వస్తుంది.
వార్షిక ఆదాయ నివేదిక: గత ఏడాది నవంబరులో ఆదాయ పన్ను విభాగం వార్షిక ఆదాయ నివేదిక (ఏఐఎస్)ను అందుబాటులోకి తెచ్చింది. ఒక ఆర్థిక సంవత్సరంలో పన్ను చెల్లింపుదారుడికి సంబంధించిన దాదాపు అన్ని ఆర్థిక లావాదేవీల వివరాలూ ఇందులో ఉంటాయి. ఇందులో పేర్కొన్న ఆదాయాలన్నింటినీ రిటర్నుల దాఖలు సమయంలో చూపించాల్సి ఉంటుంది. ఈ నివేదికను పరిశీలించి, ఇందులో మీకు సంబంధించినవి ఏమైనా లేకపోతే ఆధారాలతో సహా, పన్ను విభాగానికి తెలియజేయాలి.
ఫారం 26ఏఎస్: ఇన్‌కంట్యాక్స్ వెబ్‌సైటు నుంచి ఫారం 26ఏఎస్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. గత ఆర్థిక సంవత్సరంలో మీరు ఆర్జించిన ఆదాయం, చెల్లించిన పన్నుల వివరాలన్నీ ఇందులో ఉంటాయి. 26ఏఎస్‌లో ఉన్న టీడీఎస్ వివరాలను, మీ దగ్గర ఉన్న టీడీఎస్ సర్టిఫికెట్లతో సరిపోల్చుకోవాలి.
మినహాయింపులు: ఆదాయ పన్ను పాత విధానాన్ని ఎంచుకున్న వారు.. తాము పొందిన మినహాయింపులకు సంబంధించిన ఆధారాలను జాగ్రత్త చేసుకోవాలి. సాధారణంగా యాజమాన్యానికి ముందే ఈ ఆధారాలు అందిస్తారు. అయినప్పటికీ.. అవన్నీ ఫారం16లో నమోదయ్యాయో లేదో మరోసారి సరిచూసుకోవాలి. యాజమాన్యానికి ఇవ్వని పన్ను ఆదా పెట్టుబడుల వివరాలను రిటర్నుల సమయంలో క్లెయిం చేసుకోవచ్చు.
మూలధన రాబడి: స్థిరాస్తులను విక్రయించడం, షేర్లు, మ్యూచువల్ ఫండ్ యూనిట్లు అమ్మడం తదితర లావాదేవీల నుంచి వచ్చిన మూలధన లాభాలను రిటర్నులలో చూపించాలి. మూలధన రాబడి ఉన్నవారు.. ఐటీఆర్-1కు బదులు, ఐటీఆర్ 2 లేదా ఐటీఆర్ 3లో రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది.
బ్యాంకు ఖాతాలు: 2021-22లో మీరు నిర్వహించిన బ్యాంకు ఖాతాల గురించి రిటర్నులలో తెలియజేయాలి. వీటిని రద్దు చేసుకున్నా సరే.. ఆ వివరాలు చెప్పాల్సిందే.
ఇదీ చూడండి : స్టాక్ మార్కెట్..తగ్గినా.. మంచిదే..! అదెలానో తెలుసుకోండి మరీ..