India Competitiveness Index rank: ఆసియా ఆర్థిక వ్యవస్థల్లో వేగంగా వృద్ధి చెందినందున, వార్షిక ప్రపంచ పోటీతత్వ సూచీలో భారత స్థానం 43 నుంచి 6 స్థానాలు మెరుగై, 37కు చేరిందని ఇన్‌స్టిట్యూట్ ఫర్ మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్ (ఐఎండీ) వెల్లడించింది. 63 దేశాలతో రూపొందించిన ఈ జాబితాలో అగ్రస్థానాన్ని డెన్మార్క్ దక్కించుకుంది. గతేడాది అది మూడో స్థానంలో ఉంది. స్విట్జర్లాండ్ మొదటి స్థానాన్ని కోల్పోయి, రెండో స్థానంతో సరిపెట్టుకుంది. సింగపూర్ ఐదో స్థానం నుంచి మూడో స్థానానికి మెరుగైంది.
టాప్ 10లో ఇంకా ఎవరంటే?
స్వీడన్, హాంకాంగ్, నెదర్లాండ్స్, తైవాన్, ఫిన్లాండ్, నార్వే, యూఎస్‌ఏలు తొలి 10 స్థానాల్లో ఉన్నాయి. ఆసియా ఆర్థిక వ్యవస్థల్లో సింగపూర్ (3), హాంకాంగ్ (5), తైవాన్ (7), చైనా (17) మెరుగైన స్థానాలు పొందాయి. ఆర్థిక వ్యవస్థ పనితీరు మెరుగవడంతోనే భారత్ ర్యాంకు పెరిగిందని ఐఎండీ వెల్లడించింది. వ్యాపార సామర్థ్య పారామితుల్లో కీలకమైన లేబర్ మార్కెట్ 15వ స్థానం నుంచి 6వ స్థానానికి చేరుకుంది. నిర్వహణ పద్ధతులు, వ్యాపార విలువలు ఇక్కడ కీలకంగా మారాయని చెప్పింది.
'సవాళ్లు ఉన్నాయ్..'
నరేంద్ర మోదీ ప్రభుత్వం 'పాత తేదీ నుంచి పన్ను విధించే విధానాల'ను విడనాడటం ప్రపంచ వాణిజ్య రంగంలో భారత్‌పై నమ్మకాన్ని పునరుద్ధరించిందని పేర్కొంది. వాతావరణ మార్పుల అంశంపై భారత్ చురుగ్గా పని చేస్తుండటమూ కలిసొచ్చిందని తెలిపింది. వాణిజ్య అంతరాయాలు, ఇంధన భద్రత, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన, కొవిడ్ మహమ్మారి పరిణామాల అనంతరం ఆర్థిక పునరుత్తేజం వంటి సవాళ్లు భారత ఆర్థిక వ్యవస్థకు ఉన్నాయని వెల్లడించింది.
ఇదీ చదవండి: