ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ ఆర్థిక ప్రణాళికను కలిగి ఉండాలి. ఇది ఉద్యోగం చేయడం ప్రారంభించినప్పటి నుంచే ఉంటే మరీ మంచింది. మన సంపాదన, ఖర్చులు, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఒక ప్రణాళికను రూపొందించుకోవడం వల్ల భరోసాతో జీవించగలం. వాటిలో ఆరోగ్య బీమా అనేది అతి ముఖ్యమైనది. చాలా మందికి జీవిత బీమాలు ఉంటాయి కానీ, ఆరోగ్య బీమా చేసుకునే వాళ్లు చాలా తక్కువ మంది. దీన్ని కలిగి ఉంటే ఆరోగ్య విషయంలో కొంత భరోసా ఉంటుంది.
ఆరోగ్య బీమా లేని వారు తమ సంపాదనను బట్టి మంచి పాలసీని తీసుకుంటే బాగుంటుంది. అయితే పాలసీ చేయించుకునే ముందు అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రీమియం, ఆసుపత్రి నెట్ వర్క్, కవరయ్యే వ్యాధులు, జబ్బులకు సంబంధించి క్లెయిమ్ చేసుకోవడం, చేసుకునే ముందు ఉండే టైమ్ వీటిలో ఉండాలి. వీటితో పాటు పాలసీ తీసుకునే ముందు మరో 3 ముఖ్యమైన విషయాలు చెక్ చేసుకోవాలి. అవేంటో తెలుసుకుందాం..
- సబ్ లిమిట్స్(ఉప పరిమితులు): ఇవి బీమాదారుల చెల్లింపులు తగ్గించడంలో ఉపయోగపడతాయి. అంతేకాకుండా.. కొన్ని విషయాల కోసం ఎంత అమౌంట్ క్లెయిమ్ చేయవచ్చో తెలుపుతాయి. ఉదాహరణకు మీ బీమాలో క్యాన్సర్ చికిత్స కవర్ చేస్తే.. అందులో ఉప పరిమితులు ఉంటే మీరు కొంత అమౌంట్ మాత్రమే క్లెయిమ్ చేసుకోగలుగుతారు. క్యాపింగ్, ఉప పరిమితులతో కూడిన పాలసీ తీసుకోవడం కంటే.. నగదు ఎక్కువగా చెల్లించి ప్రీమియం తీసుకోవడం ఉత్తమమని కొందరు నిపుణుల అభిప్రాయం.
- తగ్గింపులు, సహ చెల్లింపులు : తగ్గింపులు అంటే బీమా కంపెనీ నుంచి మొత్తాన్ని క్లెయిమ్ చేయడానికి ముందు మీరు చెల్లించాల్సిన మొత్తం. ఈ అమౌంట్ ఎంత అనేది బీమా ఒప్పందంలో ముందే ఉంటుంది. సహ చెల్లింపులు కూడా ఇలాంటిదే. అయితే ఇది మీరు ప్రత్యేకంగా చెల్లించాల్సిన క్లెయిమ్ లో కొంత శాతాన్ని సూచిస్తుంది. ఉదాహరణకు మీరు బిల్లులో 10 శాతం చెల్లిస్తే.. మిగిలిన మొత్తాన్ని బీమా కంపెనీ చెల్లిస్తుంది. అయితే క్లెయిమ్‌కు ముందే మీరు దీన్ని చెల్లించాల్సిన అవసరం లేదు.
- క్లెయిమ్స్ : ఏదైనా బీమా పాలసీలో క్లెయిమ్స్ చాలా ముఖ్యమైన అంశం. అవసరమైన సమయంలో ఆర్థిక సాయం పొందడానికి ఇవి సహాయం చేస్తాయి. వీటిని రెండు రకాలుగా క్లెయిమ్ చేసుకోవచ్చు. నో క్లెయిమ్ బోనస్ అనేది మీ పాలసీని దీర్ఘకాలికంగా సమర్థంగా నడపడానికి దోహదపడుతుంది. మీరు యవ్వనంలో పాలసీ తీసుకుంటే.. కొన్ని రోజుల వరకు క్లెయిమ్ చేసే అవసరం ఉండదు కాబట్టి ఎలాంటి అదనపు ప్రీమియం చెల్లించకుండానే ఆ మొత్తం రెట్టింపు అవుతుంది.
అంతిమంగా మీరు తీసుకునే ఆరోగ్య బీమా పాలసీ ఏదైనా సరే.. అది మీరు, మీ కుటుంబ ఆరోగ్య అవసరాలు, పరిస్థితులకు అనుగుణంగా ఉండాలి. అలాగే క్లెయిమ్ చేసేటప్పుడు చిన్న వివరాలు తెలుసుకోవడం వల్ల ప్రయెజనం పొందవచ్చు. పాలసీని ఓకే చేసే ముందు తొందరపాటుగా ఉండకుండా సంబంధిత వివరాలను సమగ్రంగా చదవాలి.