Commercial Gas Rate Today : సామాన్యులకు కేంద్రం కాస్త ఊరట కల్పించింది. వంట గ్యాస్ సిలిండర్ల ధరలను యథాతథంగా ఉంచింది. గత నెలలో ఉన్న రేట్లనే ఈ నెలలోనూ కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు వెల్లడించాయి. జులై 1 నుంచి ఈ సవరించిన గ్యాస్ ధరలు అమలులోకి వచ్చాయి. వాస్తవానికి గ్యాస్ ధరలు స్థిరంగా ఉంచినప్పటికీ.. ఆయా రాష్ట్రాల్లోని పన్నులను అనుసరించి గ్యాస్ సిలిండర్ల ధరల్లో హెచ్చుతగ్గులు ఉండనున్నాయి.
LPG Gas Rate Today : మరోవైపు వంటింటి అవరసరాల కోసం వినియోగించే ఎల్‌పీజీ గ్యాస్ ధరలోనూ స్వల్ప మార్పులు వచ్చాయి. అయితే దిల్లీలో మాత్రం 14.2 కిలోల సిలిండర్ ఎటువంటి మార్పు లేకుండా రూ. 1,103 వద్దనే ఉంది. గతంలో చివరి సారిగా మార్చి 1న ఎల్‌పీజీ ఈ గ్యాస్ ధరను పెంచారు. ఆ సమయంలో సిలిండర్ ధరను ఓ రూ.50 పెంచడం జరిగింది.
కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధరలు
దిల్లీలో 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.1,773గానే ఉంది. కానీ ముంబయిలో అదే సిలిండర్ రూ.8.50 పెరిగి రూ.1,733.50కు చేరింది. మరోవైపు కోల్‌కతాలో ఈ సిలిండర్‌పై రూ.20 పెరిగి రూ.1,895కి చేరుకోగా.. చెన్నైలో 19కిలోల సిలిండర్ రూ.8 పెరిగి.. రూ.1,945కు అందుబాటులోకి వచ్చింది. అయితే గ్యాస్ సిలిండర్లలో ఈ ధరల మార్పుకు స్థానిక పన్నులతో పాటు రవాణా ఖర్చులు కూడా ఒక కారణం. మునుపటి నెలవారీ సవరణలను పరిగణనలోకి తీసుకుని కమర్షియల్ సిలిండర్ రేట్లను తగ్గించినట్లు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా 19 కిలోల సిలిండర్‌పై రూ.346.5 వరకు తగ్గిందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
పెట్రోల్ ధరల్లో నో ఛేంజ్.. గత 15 నెలల నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగానే ఉన్నాయి. దేశ రాజధానిలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72 ఉండగా.. డీజిల్ ధర రూ.89.62గానే ఉంది.
విమాన ఇంధన ధరలు ఇలా..
జులై నెలలో విమాన ఇంధన (ఏటీఎఫ్) ధరల్లోనూ స్వల్ప మార్పులు వచ్చాయి. సాధారణ ధర కంటే 1.65 శాతం విమాన ఇంధన (ఏటీఎఫ్) ధర పెరిగింది. దీనితో ప్రస్తుతం ఏటీఎఫ్ ధర కిలోలీటర్‌కు రూ. 1,476.79 పెరిగి రూ.90,779.88కు చేరింది. స్థానిక అమ్మకపు పన్ను లేదా వాట్ ఆధారంగా ఈ ధర ఆయా రాష్ట్రాల్లో మారుతూ ఉంటుంది. అయితే చివరి సారిగా ఈ ఏటీఎఫ్ ధర జూన్ 1న కిలోలీటరుకు రూ.6,632.25 తగ్గాయి.