Credit card user tips: ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు రుణాలు లభించడం ఎంతో తేలికయ్యింది. కొత్తతరం ఫిన్‌టెక్ సంస్థలు రుణాలను అందించడంలో దూకుడుగా ఉంటున్నాయి. అయినప్పటికీ.. క్రెడిట్ కార్డుల స్థానాన్ని అవి భర్తీ చేయలేవు. క్రెడిట్ కార్డును తీసుకోవాలనే ఆలోచనతో ఉన్నప్పుడు అందుబాటులో ఉన్న కార్డులను ముందుగా పరిశీలించండి. ఏ బ్యాంకు మీకు కార్డు అందించేందుకు ముందుకు వచ్చింది, అది అందించే ప్రయోజనాలు తెలుసుకోండి. మీ జీవన శైలికి ఏ కార్డు ఎక్కువగా ఉపయోగపడుతుంది చూసుకోండి. మీరు ఎక్కువగా ఆన్‌లైన్ షాపింగ్ చేస్తారనుకుంటే.. ఆ కొనుగోళ్లపై అధిక రివార్డులు ఇచ్చే కార్డును తీసుకోవాలి. గృహోపకరణాలు కొనుగోలు చేసినప్పుడు ఆ బిల్లును ఈఎంఐగా మార్చుకుంటే.. వడ్డీ లేకుండా ఈ వెసులుబాటునిచ్చే కార్డు పనికొస్తుంది. ఇలా అవసరం ఏమిటి? ఏ రకం కార్డు దానికి ఉత్తమం అని కాస్త పరిశోధించాకే తీసుకోవడం మేలు.
సమయానికి..
రుణం ఏదైనా సరే.. దాన్ని సకాలంలో తీర్చాల్సిన బాధ్యత రుణగ్రహీతపైన ఉంటుంది. కార్డు బిల్లునూ నిర్ణీత గడువులోపు తీర్చడం ఎప్పుడూ మంచిది. కనీస చెల్లింపుతోనే సరిపెడితే.. వడ్డీల భారం మోయాల్సి వస్తుంది. అదీ చెల్లించకపోతే.. రుసుములు భారీగానే ఉంటాయి. సాధారణంగా కార్డును వాడేదే.. రివార్డు పాయింట్లు, ఇతర తగ్గింపులు వస్తాయని. గడువు లోపు బిల్లు చెల్లించకపోతే.. వడ్డీ, రుసుములు అధికంగా చెల్లించాల్సి వస్తే.. రివార్డుల లాభం అటుంచి, భారంగా మారుతుంది. నిర్ణీత తేదీనాడు బిల్లులకు నేరుగా చెల్లింపు జరిగేలా బ్యాంకు ఖాతా నుంచి ఏర్పాటు చేయండి.
పరిమితికి లోపే..
క్రెడిట్ కార్డు పరిమితిలో ఎప్పుడూ 30 శాతానికి మించి వాడకూడదు. ఇది మీ ఆర్థిక క్రమశిక్షణను సూచిస్తుంది. తక్కువ ఖర్చు చేయడం వల్ల బిల్లు చెల్లింపులోనూ ఇబ్బంది ఉండదు. రుణ వినియోగ నిష్పత్తి తక్కువగా ఉన్నప్పుడు క్రెడిట్ స్కోరు మెరుగవుతుంది. 750పైన స్కోరున్నప్పుడు కొత్త రుణాలు తీసుకోవడం సులభమవుతుంది. నియంత్రణ లేకుండా ఖర్చు చేసి, తర్వాత బిల్లు చెల్లించకపోతే.. క్రెడిట్ స్కోరుపై ప్రతికూల ప్రభావం ఉంటుంది.
సురక్షితంగా...
కరోనా తర్వాత డిజిటల్ లావాదేవీలు ఎంతో ఊపందుకున్నాయి. ముఖ్యంగా ఆన్‌లైన్ కొనుగోళ్లు పెరిగాయి. ఇదే సమయంలో సైబర్ మోసాలూ పెరిగిపోయాయి. మనకు తెలియకుండానే కార్డు తీసుకుంటున్నవారూ.. మన దగ్గరున్న కార్డుతో లావాదేవీలు చేస్తున్నవారూ పెరిగారు. కాబట్టి, క్రెడిట్ కార్డు వాడకం విషయంలో ఏ మాత్రం అశ్రద్ధ పనికిరాదు. కార్డు సంఖ్య, సీవీవీ, ఓటీపీల్లాంటివి ఎవరికీ ఇవ్వకూడదు. కార్డు ఎప్పుడూ మీ దగ్గరే ఉండాలి. మీరు చేస్తున్న చెల్లింపులకు రెండంచెల భద్రత ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి.
కార్డును తీసుకోవడంతోనే సరిపోదు. దానికి సమయానికి చెల్లింపులు చేస్తూ.. భారం పడకుండా చూసుకోడమూ ముఖ్యమే. అప్పుడే క్రెడిట్ కార్డు అందించే పూర్తి ప్రయోజనాలను సొంతం చేసుకోగలరు.