Equity Investment : కొవిడ్ తరువాత చాలా మంది సులభంగా అధిక లాభాలు ఆర్జించాలనే ఆశలో స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టారు. కానీ సరైన అవగాహన లేక నష్టపోయిన వారే ఎక్కువ. కొందరు మాత్రం సరైన ప్రణాళికతో దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టి.. మంచి ఫలితాలను పొందుతున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా స్టాక్ మార్కెట్లోకి అడుగు పెట్టేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో పరిశీలిద్దాం.
మనం ఎందుకు పెట్టుబడులు పెడతాం? లాభాలు గడించడం కోసమే కదా! కానీ అధిక రాబడి కావాలంటే మాత్రం.. కాస్త రిస్క్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో ఈ రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. దానికి మనం సిద్ధంగా ఉండాలి. రిస్క్ వద్దు అనుకుంటే.. అసలు స్టాక్ మార్కెట్ వైపు చూడనే వద్దు. లేదు.. నేను రిస్క్ తీసుకుంటాను అంటే.. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.
ఆర్థిక క్రమశిక్షణ ఉండాలి
సాధారణంగా ఒక వ్యక్తి 25 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు ఆదాయాన్ని సంపాదిస్తాడు. ఈ సమయంలోనే అతను తన ఆర్థిక లక్ష్యాల కోసం క్రమం తప్పకుండా తగినంత మొత్తాన్ని కేటాయిస్తూ ఉండాలి. పెట్టుబడుల విషయంలోనూ ఇదే సూత్రాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. ముఖ్యంగా జీవితంలో చాలా అవసరాలు ఉంటాయి. వాటికి తగినంత మొత్తాన్ని కేటాయిస్తూనే.. పెట్టుబడుల కోసం కూడా క్రమం తప్పకుండా తగినంత సొమ్మును కేటాయించుకోవాలి. ఈ క్రమంలో కచ్చితంగా భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవాల్సి ఉంటుంది. వాస్తవానికి కొద్ది కొద్దిగా పొదుపు చేయడం కాస్త విసుగును తెప్పించే అంశమే. కానీ ఇదే దీర్ఘకాలంలో మీ సంపదను వృద్ధి చేస్తుంది అనే విషయాన్ని గుర్తుంచుకోండి.
ఉదాహరణకు ఓ 25 ఏళ్ల వ్యక్తి నెలకు రూ.10 వేలు చొప్పున పెట్టుబడులు పెట్టడం ప్రారంభించి.. 60 ఏళ్లు వచ్చేంత వరకు దానిని కొనసాగించాడని అనుకుందాం. అప్పుడు అతని పెట్టుబడి కేవలం రూ.42 లక్షలు మాత్రమే. ఈ మొత్తంపై వార్షిక సగటు రాబడి 12 శాతం వరకు వచ్చింది అనుకుందాం. అప్పుడు అతను సంపద విలువ ఎంతో తెలుసా? అక్షరాలా రూ.6.4 కోట్లు.
ఒక వేళ అతను 35 ఏళ్ల నుంచి రూ.14,000 చొప్పున మదుపు చేస్తే.. 60 ఏళ్లు వచ్చే నాటికి కేవలం రూ.21 లక్షలు మదుపు చేయగలిగేవాడు. ఇప్పుడు కూడా 12 శాతం రాబడి అంచనా వేస్తే.. అతను కేవలం రూ.2.6 కోట్ల సంపదను మాత్రమే ఆర్జించగలడు. అంటే 10 ఏళ్లు ఆలస్యంగా మదుపు చేయడం ప్రారంభించడం వల్ల అతను చాలా పెద్ద మొత్తాన్ని ఆర్జించే అవకాశాన్ని కోల్పోయాడు. అంటే దీర్ఘకాల పెట్టుబడి, సహనం ఈ రెండూ కూడా మీకు సంపదను సృష్టించి పెడతాయని మీరు అర్థం చేసుకోవాలి.
నిపుణుల సలహాలు తీసుకోండి
ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టే ముందు కచ్చితంగా సరైన అవగాహన పెంచుకోండి. దీనితో పాటు నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది. జీవితాంతం కష్టపడి సంపాదించిన సొమ్మును.. రిస్క్ ఎక్కువగా ఉండే ఈక్విటీల్లో మదుపు చేస్తున్నప్పుడు కచ్చితంగా నిపుణుల సలహాలు తీసుకోవడం అవసరం. అది మీ పెట్టుబడులను కాపడడం మాత్రమే కాకుండా.. భవిష్యత్‌లో గొప్ప సంపదను మీరు పోగుచేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది.
నోట్ : ప్రస్తుతం దేశంలో చాలా వరకు ఫేక్ ఎక్స్‌పర్ట్‌లు తయారయ్యారు. అదే విధంగా కొందరు మోసపూరిత సలహాలు ఇస్తుంటారు. ఇలాంటి వారి పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. మీ మొబైల్ ఫోన్లకు వచ్చే సందేశాలు, ఈ మెయిల్స్‌కు వచ్చే షేర్స్, మ్యూచువల్ ఫండ్ సూచనలను నమ్మి మోసపోకండి.
పెట్టుబడులు వైవిధ్యంగా ఉండాలి
పెట్టుబడులు అన్నీ ఒకే దగ్గర కాకుండా.. వైవిధ్య భరితంగా మదుపు చేయాల్సి ఉంటుంది. ఫిక్స్డ్ డిపాజిట్స్, మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ షేర్స్, గవర్నమెంట్ బాండ్స్, బంగారం, రియల్ ఎస్టేట్ లాంటి వైవిధ్య భరితమైన పెట్టుబడులు పెట్టడం మంచిది. అప్పుడే నష్టభయం తక్కువగా ఉంటుంది. సంపద వృద్ధి చెందే అవకాశం మెరుగవుతుంది.