స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ సానుకూల పవనాలు దేశీయ మార్కెట్లను పరుగులు పెట్టిస్తున్నాయి. సెన్సెక్స్ 533 పాయింట్లు లాభపడి 38,677 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.
నిఫ్టీ కూడా 180 పాయింట్లు పెరిగి 11,312.5 వద్ద ట్రేడవుతోంది.
అన్నీ లాభాల్లోనే...
30 షేర్ ఇండెక్స్‌లో అన్నీ లాభాల్లో సాగుతున్నాయి. సన్‌ఫార్మా, హీరో మోటోకార్ప్, టాటా స్టీల్, రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్, బజాజ్ ఫినాన్స్, భారతీ ఎయిర్టెల్, ఎస్బీఐ టాప్‌లో ఉన్నాయి.
జీ-7 దేశాల ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకు అధిపతులు ఇవాళ సమావేశం కానున్నారు. ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్ ప్రభావంపై వీరు చర్చించనున్నారు. ఈ భేటీలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనానికి పరిష్కారం దొరుకుతుందన్న అంచనాలు మదుపరుల నమ్మకాన్ని బలపరిచాయి.
అమెరికా మార్కెట్ల జోరు..
అమెరికా డౌజోన్స్ సోమవారం భారీగా లాభపడింది. 2009 తర్వాత ఒక్కరోజులో 5 శాతం లాభాలను ఆర్జించింది. నాస్డాక్, ఎస్ అండ్ పీ కూడా 4 శాతం పెరుగుదల నమోదు చేశాయి.
జీ-7 భేటీ నేపథ్యంలో ఆసియా మార్కెట్లు కూడా లాభాల్లో కొనసాగాయి. వీటితో పాటు విదేశీ నిధుల ప్రవాహంతో దేశీయంగా మదుపరుల సెంటిమెంటు బలపడింది.
బలపడిన రూపాయి..
డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 16 పైసలు వృద్ధితో 72.59కు చేరుకుంది.
అంతర్జాతీయ ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 2.43 శాతం పెరిగి 53.16 డాలర్ల వద్ద కొనసాగుతోంది.