Stock Market LIVE Updates: అంతర్జాతీయ బలహీన పవనాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. ప్రారంభంలో 1100 పాయింట్లకు పైగా పతనమైన సెన్సెక్స్.. ప్రస్తుతం 1076 పాయింట్ల నష్టంతో 56,780 వద్ద ట్రేడవుతోంది. దాదాపు అన్ని రంగాలు నష్టాల్లోనే ఉన్నాయి. ఫార్మా, లోహ, ఐటీ షేర్లు భారీగా పతనమయ్యాయి.
నిఫ్టీ సైతం భారీ నష్టాల్లో ఉంది. ప్రస్తుతం 318 పాయింట్లు పడిపోయి.. 16,959 వద్ద కొనసాగుతోంది.
సెన్సెక్స్ షేర్లలో హెచ్డీఎఫ్సీ, విప్రో, టైటాన్ షేర్లు భారీగా పతనమయ్యాయి. టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ వంటి షేర్లు సైతం నష్టపోయాయి.
కారణం ఇదే!
వడ్డీ రేట్లు పెంచుతామని అమెరికా ఫెడరల్ బ్యాంకు బుధవారం సంకేతాలు ఇవ్వడం మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు ఫెడ్ పేర్కొంది. దీంతో మదుపర్లు అమ్మకాలకు దిగుతున్నారు. విదేశీ సంస్థాగత మదుపర్లు పెద్ద ఎత్తున తమ పెట్టుబడులను ఉపసంహరించుకోవడమూ నష్టాలకు కారణమవుతోంది.
అమెరికా స్టాక్ మార్కెట్లు మిశ్రమంగా కదిలాయి. ఇతర ఆసియా మార్కెట్లు డీలా పడ్డాయి.
అంతర్జాతీయంగా బ్యారెల్ ముడిచమురు ధర 0.93 శాతం పెరిగింది. ప్రస్తుతం ఒక్కో బ్యారెల్ 89.12 పలుకుతోంది.