రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్ణయాలు మార్కెట్లలో ఉత్సాహాన్ని నింపాయి. వడ్డీరేట్లను మార్చకపోవడం, వృద్ధి అంచనాలను సవరించడం వల్ల దేశీయ సూచీలు రికార్డు స్థాయిలో పరుగులు పెడుతున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ తొలిసారిగా 45 వేల మార్క్‌ను దాటగా.. నిఫ్టీ కొత్త గరిష్ఠాన్ని తాకింది.
ఆర్‌బీఐ సమీక్షపై తొలినుంచి సానుకూలంగా ఉన్న మదుపర్లు నేటి ట్రేడింగ్ ఆరంభంలోనే కొనుగోళ్ల బాటపట్టారు. దీంతో శుక్రవారం నాటి సెషన్‌ను లాభాలతో మొదలుపెట్టిన సూచీలు.. ఆర్‌బీఐ ప్రకటన తర్వాత మరింత దూసుకెళ్లాయి. ఒక దశలో సెన్సెక్స్ 370 పాయింట్లు ఎగబాకి 45,002 వద్ద జీవితకాల గరిష్ఠ స్థాయిలో ట్రేడ్ అయ్యింది. నిఫ్టీ కూడా 13,200 పైన సాగింది. ప్రస్తుతం 11.15 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 312 పాయింట్ల లాభంతో 44,946 వద్ద, నిఫ్టీ 92 పాయింట్ల లాభంతో 13,226 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, ఆల్ట్రాటెక్ సిమెంట్ భారీ లాభాల్లో ఉన్నాయి.
ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను గవర్నర్ శక్తికాంతదాస్ శుక్రవారం వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ -7.5శాతంగా నమోదు కావొచ్చని ఆర్‌బీఐ అంచనా వేసింది.