అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితులు, అమెరికా ఎన్నికల నేపథ్యంలో మదుపరులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దీంతో దేశీయ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. తొలుత 200 పాయింట్ల పతనంతో ప్రారంభమైన బొంబయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్... ప్రస్తుతం 153 పాయింట్ల నష్టంతో 39,457 వద్ద కొనసాగుతోంది.
అటు జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ సైతం నష్టాల బాటలోనే పయనిస్తోంది. 52 పాయింట్లు పతనమై.. 11,590 వద్ద ట్రేడవుతోంది.
లాభనష్టాల్లోనివివే
హెవీవెయిట్ షేర్లు ట్రేడింగ్ ప్రారంభంలో భారీ నష్టాలు చవిచూశాయి. రిలయన్స్ 4శాతానికి పైగా పతనమైంది. హెచ్సీఎల్ టెక్, టీసీఎస్, ఏషియన్ పేంట్స్, బజాజ్ ఆటో, ఇన్ఫోసిస్, హెచ్యూఎల్ షేర్లు నష్టాల బాటపట్టాయి.
ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, ఎస్బీఐ సంస్థల షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి. ఐదు శాతానికిపైగా ఎగబాకాయి.
కొనసాగనున్న అనిశ్చితి
అమెరికా ఎన్నికలతో పాటు వడ్డీ మాఫీపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో మార్కెట్లలో అనిశ్చితి కొనసాగే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే.. రెండో త్రైమాసికంలో అంచనాలను మించి రాణించిన హీరో మోటో కార్ప్, మారుతీ, ఐసీఐసీఐ కంపెనీల షేర్లు మార్కెట్లను ఆదుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.
అంతర్జాతీయ మార్కెట్లు
ఆసియా మార్కెట్లలో షాంఘై నష్టాలతో ప్రారంభం కాగా.. హాంకాంగ్, సియోల్, టోక్యో స్టాక్ ఎక్స్ఛేంజీలు సానుకూలంగా ట్రేడింగ్ ఆరంభించాయి.
ముడిచమురు
అంతర్జాతీయంగా ముడిచమరు ధర 3.27 శాతం పతనమైంది. ప్రస్తుతం బ్యారెల్ చమురు ధర 36.70 డాలర్లుగా ఉంది.