గత కొంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లలో(Stock Markets) ర్యాలీ నడుస్తోంది. నష్టాలు వచ్చినా.. స్వల్పకాలానికే పరిమితమవుతున్నాయి. కొవిడ్ తొలి వేవ్ తర్వాత పుంజుకున్న మార్కెట్లు అంతకంతకూ పెరుగుతూ పోతున్నాయి. ఈ నేపథ్యంలో మదుపర్లు తమ పెట్టుబడులను డైవర్సిఫికేషన్ చేసుకుంటే నష్టభయం తగ్గుతుందని నిపుణులు సూచిస్తున్నారు. డైవర్సిఫికేషన్ అనగానే కంపెనీలు, రంగాలు, పరిశ్రమలు, మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగానే అనుకుంటారు! నష్టభయం తక్కువగా ఉండే విదేశీ మార్కెట్లనూ పోర్ట్‌ఫోలియోలో చేర్చుకోవచ్చంటున్నారు నిపుణులు. మరి ప్రపంచ దిగ్గజ కంపెనీలు నమోదైన అమెరికా స్టాక్ మార్కెట్లలో (US Stock Markets)మదుపు చేస్తే కచ్చితమైన రాబడితో పాటు లాభాలూ ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. మరి అమెరికా మార్కెట్లలో మదుపు చేయడం ఎలాగో చూద్దాం!
అమెరికా మార్కెట్లలో ఎందుకు?
అమెరికా స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టేందుకు 'లిబరలైజ్డ్ రెవెన్యూ స్కీం(ఎల్‌ఆర్‌ఎస్)' కింద 'రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ)' అనుమతించింది. ఎలాంటి అనుమతులు లేకుండా రూ.1.9 కోట్ల వరకు మదుపు చేయొచ్చు. మరి అమెరికా మార్కెట్లో ఎందుకు మదుపు చేయాలో కొన్ని బలమైన కారణాలు చూద్దాం!
- భారత స్టాక్ మార్కెట్లతో పోలిస్తే.. అమెరికా మార్కెట్లలో ఊగిసలాట(వొలటాలిటీ) తక్కువ.
- ప్రపంచవ్యాప్త దిగ్గజ కంపెనీలు అమెరికా కేంద్రంగానే పనిచేస్తున్నాయి. మన పెట్టుబడులను వివిధ కంపెనీల మధ్య డైవర్సిఫై చేసుకునే అవకాశం ఉంటుంది.
- యాపిల్, గూగుల్, ఫేస్‌బుక్, టెస్లా, అమెజాన్ వంటి దిగ్గజ కంపెనీల్లో మదుపు చేయొచ్చు. తద్వారా స్థిరమైన వృద్ధి అవకాశాలున్న ఈ కంపెనీల పయనంలో భాగస్వాములం కావొచ్చు.
- అంకుర సంస్థలకు కేంద్రమూ అమెరికాయే. కాబట్టి భవిష్యత్తులో వృద్ధికి అవకాశముండే రంగాల్లో పుట్టుకొస్తున్న వినూత్న కంపెనీలను ఎంచుకొని పెట్టుబడులు పెట్టొచ్చు.
అమెరికా మార్కెట్లో మదుపు చేయడం ఎలా?
దీనికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి ప్రత్యక్షంగా స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడం. మరొకటి మ్యూచువల్ ఫండ్స్ లేదా ఈటీఎఫ్ ద్వారా పరోక్షంగా స్టాక్ మార్కెట్లలో మదుపు చేయడం. స్థానిక లేదా విదేశీ స్టాక్ బ్రోకరేజీ సంస్థల్లో ట్రేడింగ్ ఖాతా తెరవడం ద్వారా నేరుగా మదుపు చేయొచ్చు. బ్రోకరేజీ సంస్థల్ని ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. సంస్థను బట్టి కొన్ని ఆంక్షలు ఉంటాయి. మదుపు చేసే మొత్తం.. నెలవారీ ట్రేడింగ్ సెషన్స్, డాలర్ల మారకం ఛార్జీలు.. వంటి పరిమితులను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి.
ఇక పరోక్ష పద్ధతిలో పెట్టుబడి పెట్టాలంటే మూడు మార్గాలున్నాయి.
మ్యూచువల్ ఫండ్లు..
విదేశీ స్టాక్ మార్కెట్లలో మదుపు చేయడానికి ఇది సులువైన మార్గం. ఎలాంటి ట్రేడింగ్ అకౌంట్ అవసరం లేదు. ఎలాంటి కనీస డిపాజిట్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. భారత్‌లో అనేక ఫండ్ల కంపెనీలు అమెరికా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్లను అందిస్తున్నాయి.
ఎక్స్‌ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్లు(ఈటీఎఫ్)..
ఈటీఎఫ్‌లో మదుపు చేయడం ద్వారా కూడా అమెరికా మార్కెట్లలో పెట్టుబడి పెట్టొచ్చు. దీనికి కూడా ప్రత్యక్ష, పరోక్ష మార్గాలున్నాయి. దేశీయ లేదా అంతర్జాతీయ బ్రోకర్ల నుంచి అమెరికా ఈటీఎఫ్‌లను కొనుగోలు చేయొచ్చు. లేదా అంతర్జాతీయ సూచీల్లో నమోదైన భారత ఈటీఎఫ్‌లను కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది.
కొత్తతరం మొబైల్ యాప్‌లు..
స్మార్ట్ ఫోన్ల రెవల్యూషన్ తర్వాత పెట్టుబడుల స్వరూపం కూడా మారిపోయింది. ఇటీవల ఉద్భవించిన అనేక అంకుర సంస్థలు మొబైల్ యాప్‌ల ద్వారా అమెరికా మార్కెట్లలో పెట్టుబడి పెట్టే అవకాశాన్ని కల్పిస్తున్నాయి.
ఈ విషయాలు గుర్తుంచుకోండి..
- అమెరికా మార్కెట్లను విశ్లేషించి నిర్ణయాలు తీసుకోగలిగే సామర్థ్యం ఉంటేనే ట్రేడింగ్ అకౌంట్ తెరవడం మంచిది.
- అంతర్జాతీయ పెట్టుబడి మార్గాల్లో తరచూ మార్పులు సంభవిస్తుంటాయి. ఖాతా నిర్వహణ, బ్రోకరేజీ, మారకపు విలువ.. వంటి రుసుములను తరచూ చెక్ చేసుకుంటూ ఉండాలి.
- రిటైల్ ఇన్వెస్టర్లు అమెరికా మార్కెట్‌లో నేరుగా ట్రేడింగ్ చేయడం కంటే.. మ్యూచువల్ ఫండ్లు, ఈటీఎఫ్‌లలో మదుపు చేయడం మేలు. ట్రేడింగ్‌లో వచ్చే కాసిన్ని లాభాలు కూడా ఛార్జీల రూపంలో కరిగిపోయే అవకాశం ఉంది.
- మన ఆర్జనపై భారత్‌తో పాటు అమెరికాలోనూ పన్నులు విధించే అవకాశం ఉంది.
- తక్కువ మొత్తంతో ప్రారంభించి.. అమెరికా మార్కెట్లపై అవగాహన పెరిగిన కొద్దీ పెట్టుబడి మొత్తాన్ని పెంచుకుంటూ వెళ్లడం సురక్షితం.
విదేశీ స్టాక్స్‌లలో మదుపు చేయడం వల్ల మన పోర్ట్‌ఫోలియోకు మరింత బలం చేకూరే అవకాశం ఉంది. సమాచారం క్షణాల్లో లభ్యమవుతున్న ఈ తరుణంలో ఎప్పటికప్పుడు మార్కెట్లను పరిశీలిస్తూ విశ్లేషించాలి. ఏదేమైనప్పటికీ.. విదేశీ స్టాక్ మార్కెట్లలో మదుపు చేయడం వల్ల లాభాలతో పాటు నష్టాలూ ఉండే అవకాశం ఉంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని.. మీ ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా మదుపు చేయండి.
ఇదీ చూడండి: హోం ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా? ఇవి తెలుసుకోండి..