ఆర్థిక మాంద్యం భయాలు ప్రపంచ మార్కెట్లను కుదిపేశాయి. చైనా పరిశ్రమల ఉత్పత్తి 17 ఏళ్ల కనిష్ఠానికి పడిపోవటం, రెండో త్రైమాసికంలో జర్మనీ ఆర్థిక వ్యవస్థ తిరోగమన దిశలో పయనించిందన్న నివేదికలతో అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో అమెరికా డౌజోన్స్ భారీస్థాయిలో నష్టపోయింది.
డౌజోన్స్ 800 పాయింట్లు కోల్పోయి 24,479 వద్ద ముగిసింది. ఈ ఏడాది డౌజోన్స్ ఈ స్థాయిలో పతనం అవడం ఇదే తొలిసారి. ఈ ప్రభావంతో ఐరోపా మార్కెట్లు 2 శాతం మేర నష్టపోయాయి.
చైనా ఉత్పత్తులపై సుంకాలను వెనక్కు తీసుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ నిర్ణయం నేపథ్యంలో కొన్నిరోజులుగా సానుకూలంగా స్పందించాయి మార్కెట్లు. చైనా పరిస్థితి, జర్మనీ నివేదికతో మళ్లీ నష్టాల వైపు సాగాయి.
ఆసియాపై ప్రభావం
అమెరికా విపణి ప్రభావంతో ఆసియా మార్కెట్లు కూడా నష్టాల బాట పట్టాయి. హాంగ్కాంగ్ నిరసనల్లో బీజింగ్ జోక్యంతో అనిశ్చితి నెలకొనడం మరో కారణం.
జపాన్ నిక్కీ మొదట 2 శాతం మేర క్షీణించినా... తిరిగి కోలుకుని 1.2 శాతం నష్టంతో రోజును ముగించింది. హాంగ్కాంగ్ మార్కెట్ తొలుత 1.5 శాతం నష్టాలు చవిచూసినా చివరకు కోలుకుని 0.1 శాతం నష్టాలతో ముగిసింది. షాంఘై, జకర్తా మార్కెట్లు 0.7 శాతం, సింగపూర్ 0.9 శాతం మేర కోల్పోయాయి.
జర్మనీ నివేదిక
రెండో త్రైమాసికంలో ఐరోపా ఆర్థిక వ్యవస్థ మందగించిందని జర్మనీ నివేదిక పేర్కొంది. ఫ్రాంక్ఫర్ట్ సూచీలు మూడు నెలల కనిష్ఠానికి పడిపోయాయి.