దేశ వ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు స్టాక్ మార్కెట్లను నష్టాల దిశగా నడిపిస్తున్నాయి. బుధవారం సెషన్లో సూచీలు భారీ నష్టాలతో ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 871 పాయింట్లు కోల్పోయి.. 49,180 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 265 పాయింట్ల నష్టంతో 14,549 వద్దకు చేరింది.
చివరి సెషన్లో సెన్సెక్స్ 800 పాయింట్లు నష్టపోయింది. అదే సమయంలో నిఫ్టీ 14,600 మార్కును కోల్పోయింది.
మంగళవారం గడించిన లాభాలను సొమ్ము చేసుకోవడానికి మదుపరులు మొగ్గు చూపడం కూడా నష్టాలకు కారణమయ్యాయన్నది నిపుణుల మాట.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 49,854 పాయింట్ల అత్యధిక స్థాయి, 49,120 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 14,752 పాయింట్ల గరిష్ఠ స్థాయి; 14,535 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
ఏషియన్ పెయింట్స్, పవర్‌గ్రిడ్ షేర్లు మాత్రమే లాభాలను నమోదు చేశాయి. 30 షేర్ల ఇండెక్స్‌లో ఈ రెండు కంపెనీలే లాభపడ్డాయి.
ఎం అండ్ ఎం, ఎస్బీఐ,యాక్సిస్ బ్యాంక్, ఇండస్ ఇండ్, ఎల్ అండ్ టీ, ఐటీసీ, ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, కోటక్ మహేంద్ర బ్యాంక్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.