క్రిప్టో కరెన్సీ గురించి సంవత్సరం కాలంగా ఎక్కువ చర్చ జరుగుతోంది. ఎలాన్ మస్క్ లాంటి ప్రముఖ వ్యక్తి వీటి గురించి మాట్లాడటం, భవిష్యత్ కరెన్సీల గురించి ఆలోచనలు దీనికి ముఖ్య కారణాలు. క్రిప్టో కరెన్సీలలో ఒకటైన బిట్కాయిన్ విలువ భారీగా పెరగటం దీనికి మరింత ఊతాన్ని ఇచ్చింది. బిట్కాయిన్ పేరడీగా తయారు చేసిన డాగీ కాయిన్ ఆశ్చర్య పోయే లాభాలను ఇవ్వటం కూడా కలిసి వచ్చింది.
గతేడాది కరోనా ప్రారంభంలో భవిష్యత్‌పై అస్పష్టత నెలకొంది. లాక్‌డౌన్‌తో ఆర్థిక కార్యకలాపాలు స్తంభించాయి. అత్యవసర కార్యకలాపాలు మినహా మిగతావి నిలిచిపోవడం కారణంగా ఆర్థికవ్యవస్థ వృద్ధిపై ఆందోళనలు నెలకొన్నాయి. దీనితో స్టాక్‌మార్కెట్ సూచీలు పడిపోయాయి. బిట్కాయిన్ కూడా అదే బాట పట్టింది.
సెన్సెక్స్ గత ఏడాది మార్చిలో 41వేల నుంచి 26వేల స్థాయికి పడిపోయింది. అదే సమయంలో నిఫ్టీ 12వేల స్థాయి నుంచి 7,500 స్థాయికి కుంగింది. అమెరికా డాలర్లలో తీసుకుంటే బిట్కాయిన్ కూడా మార్చి 2020లో 8వేల డాలర్లు ఉండగా.. 4వేల డాలర్లకు దిగజారింది. అంటే సగానికి సగం పడిపోయింది.
స్టాక్స్ కంటే ఎక్కువ..
మార్చి అనంతరం మార్కెట్లు, క్రిప్టో కరెన్సీల విలువ పెరగటం ప్రారంభమైంది. సూచీలతో పోల్చితే క్రిప్టో కరెన్సీ మంచి ప్రదర్శన కనబర్చింది. గతేడాది జులైలో 10,500 వద్ద ఉన్న నిఫ్టీ ప్రస్తుతం 15,600కి చేరింది. అంటే ఏడాది కాలంలో దాదాపు 48 శాతం రాబడిని ఇచ్చింది. అదే సమయంలో సెన్సెక్స్ 34,500 పాయింట్ల నుంచి 52వేల స్థాయికి ఎగబాకింది. అంటే దాదాపు 40 శాతం రాబడిని ఇచ్చింది.
గతేడాది జులైలో బిట్కాయిన్ 9వేల డాలర్ల స్థాయిలో ఉంది. ఇప్పుడది 34వేల డాలర్ల స్థాయిలో ట్రేడవుతోంది. అంటే గత సంవత్సర కాలంలో 277 శాతం రాబడిని ఇచ్చింది. ఇటీవల కరెక్షన్ రావటం వల్ల దీని విలువ భారీగా తగ్గింది. మే నెలలో ఒక్క బిట్కాయిన్ విలువ 59వేల డాలర్లు(దాదాపు రూ.45లక్షలు)గా ఉండేది. ఫిబ్రవరిలో 37వేల స్థాయిలో ఉండేది. అంటే కేవలం మూడు నాలుగు నెలల్లోనే భారీగా పెరిగింది.
క్రిప్టో లాభాలకు కారణాలివే..
బిట్కాయిన్ భారీస్థాయిలో లాభాలు నమోదు చేయడానికి కారణాలు లేకపోలేదు. అమెరికాకు చెందిన ప్రఖ్యాత ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ, అంతరిక్ష సంస్థ స్పేస్ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ క్రిప్టో కరెన్సీపై సానుకూలంగా స్పందించారు. క్రిప్టో కరెన్సీల గురించి తరచూ.. ఏదో ఒక ప్రకటన చేయడం వల్ల.. ఫిబ్రవరి నుంచి బిట్కాయిన్ విలువ భారీగా పెరిగింది.
టెస్లా కార్లను బిట్‌కాయిన్‌తో కొనుగోలు చేసే వీలుందని ప్రకటించిన ఎలాన్ మస్క్. ఆ తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. బిట్కాయిన్ మైనింగ్‌కు ఎక్కువగా విద్యుత్ వినియోగిస్తుండటం వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందనే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనితో బిట్‌కాయిన్‌లో భారీ కరెక్షన్ ఒచ్చింది. ఒకానొక దశలో 32 వేల డాలర్ల స్థాయికి పడిపోయింది.
భవిష్యత్..
ప్రముఖ క్రిప్టో అయిన ఇథేరియం కూడా మంచి ప్రదర్శననే కనబరిచింది. అయితే క్రిప్టో కరెన్సీ మైనింగ్‌లో ఉపయోగించే విద్యుత్‌ను బట్టి వాటి భవిష్యత్ ఆధారపడి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే సాధారణంగా క్రిప్టో కరెన్సీల్లో హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉంటాయి. ఇది కొనసాగే అవకాశం ఉంటుందని అంటున్నారు.
బంగారం
బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా పరిగణిస్తారు. కరోనా వల్ల అనిశ్చిత వాతావరణం నెలకొనటం కారణంగా అందరూ బంగారం వైపు అడుగులు వేశారు. దీనితో వాటి ధర పెరుగుదల ప్రారంభమైంది. గతేడాది ఆగస్టులో జీవనకాల గరిష్ఠ స్థాయి రూ. 58వేలను తాకింది. జులై ఆగస్టు మధ్యనే ఏడు వేలకు పైగా పెరగడం గమనార్హం.
కరోనా తగ్గటం, ఆర్థిక కార్యకలాపాలు పెరగటం వల్ల మళ్లీ బంగారం ధర తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.50వేలకు లభిస్తోంది. గత ఏడాది కాలంగా చూసుకుంటే బంగారంపై రాబడి లేదు. అయితే గతేడాది ఆగస్టులో గరిష్ఠాల వద్ద పెట్టుబడి పెట్టిన వారు ప్రస్తుతం నష్టాల్లోనే ఉన్నారు.
ఇదీ చూడండి: 'పెట్టుబడుల ఉపసంహరణకు ఇది సరైన సమయం'