కరోనా మహమ్మారి దేశీయంగా ఎంతో మందిని ఆర్థికంగా దెబ్బతీసింది. ఈ సమయంలో జీవిత, ఆరోగ్య బీమా పాలసీలకు ఎక్కడలేని గిరాకీ పెరిగింది. క్లెయింల సంఖ్య పెరగడం వల్ల బీమా సంస్థలు ప్రీమియాలను ఒక్కసారిగా పెంచేశాయి. అందరినీ బీమా పాలసీల పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నా.. బీమా రంగం నుంచి ఆశించిన ప్రతిస్పందన రావడం లేదు. డిజిటల్ పాలసీలకు ప్రాధాన్యం ఇస్తున్న బీమా సంస్థలు.. గ్రామీణ ప్రాంతాలను, తక్కువ ఆదాయ వర్గాలను పూర్తిగా విస్మరిస్తున్నాయి. బీమా నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ ప్రామాణిక పాలసీలను తీసుకొస్తున్నా.. బీమా సంస్థలు వాటిని అంతగా ప్రోత్సహించడం లేదు. వెరసి.. అందరికీ ధీమా అనేది ఇంకా అందని ద్రాక్షగానే మారుతోంది.
ఇన్ని సంస్థలున్నా..
దేశంలో 24 జీవిత బీమా, 34 సాధారణ బీమా సంస్థలున్నాయి. ఇవి ఎన్నో పాలసీలు అందిస్తున్నా, దేశంలో ఇప్పటికీ బీమా పాలసీలు పొందింది 3.76 శాతం ప్రజలే. ప్రపంచంలోనే ఇది అతి తక్కువ. 2020 నాటికి బీమా పరిశ్రమ వ్యాపారం దాదాపు 280 బిలియన్ డాలర్ల (సుమారు రూ.21 లక్షల కోట్ల)కు చేరుకుంటుందని అంచనాలుండేవి. పాలసీల సంఖ్య పెరుగుతున్న కొద్దీ.. వాటిలో సంక్లిష్టతా పెరుగుతోంది. వాటిని అర్థం చేసుకోవడం అంత తేలికేమీ కాదు. అందుకే, ఎక్కువమంది బీమా సంస్థ సలహాదారు లేదా ఇతర నిపుణుల సూచనల ఆధారంగానే పాలసీలు తీసుకుంటున్నారు. తీరా క్లెయిం వేళలో ఆ పాలసీ కొన్నింటికి వర్తించదు.. మరికొన్నింటికి పరిహారం ఇవ్వదు.. ఇలా ఎన్నో సమస్యలు. ఎంతో అవగాహన ఉన్న వారూ తమ పాలసీల ఎంపికలో పొరపాటు నిర్ణయం తీసుకోవడం సహజంగా మారింది.
ఒకే తరహాలో..
ఆర్థిక పథకాల విషయంలో పూర్తి అవగాహన ఉండాలనేది నిపుణుల మాట. దీనికి తగ్గట్టుగానే.. బీమా పాలసీల గురించి సులభంగా అర్థం చేసుకునే దిశగా భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార మండలి (ఐఆర్‌డీఏఐ) ప్రామాణిక పాలసీలను ప్రవేశ పెట్టింది. ఆరోగ్య బీమా విభాగంలో ఆరోగ్య సంజీవని, టర్మ్ పాలసీ విభాగంలో సరళ్ బీమా యోజనను అందుబాటులోకి తెచ్చింది. కొవిడ్-19 నేపథ్యంలో కరోనా కవచ్, కరోనా రక్షక్ పాలసీలను ఆవిష్కరించింది. ఇవి పూర్తి పారదర్శకంగా ఉండటంతో పాటు, ఏ బీమా సంస్థలో అయినా నిబంధనలన్నీ ఒకే విధంగా ఉంటాయి. బీమా సంస్థలన్నీ ఈ పాలసీలను తప్పనిసరిగా అందుబాటులోకి తీసుకురావాల్సి వచ్చింది. అయితే నిబంధనలను పాటించేపేరిట ఈ పాలసీలను తీసుకొచ్చిన బీమా సంస్థలు, వీటి విక్రయంపై శ్రద్ధ చూపించడం లేదని బీమా నిపుణులు చెబుతున్నారు. కనీసం వీటి గురించి ప్రచారమూ ఎక్కడా కనిపించడం లేదు.
ప్రీమియం భారంగా..
ఐఆర్‌డీఏఐ ఆదేశాల మేరకు బీమా సంస్థలు ప్రామాణిక పాలసీలను ప్రవేశ పెట్టినప్పటికీ.. వీటికి బీమా సంస్థలు ప్రీమియాన్ని అధికంగా నిర్ణయిస్తున్నాయి. ‘సాధారణంగా బీమా సంస్థలు పాలసీ ఇచ్చేటప్పుడు పాలసీదార్ల వ్యక్తిగత వివరాలు పూర్తిగా సేకరిస్తాయి. ఆ వివరాల ఆధారంగా టర్మ్ పాలసీని జారీ చేస్తాయి. దీనికి అనుగుణంగా ప్రీమియం రేట్లను నిర్ణయిస్తాయి. అయితే అందరికీ బీమా అందాలనే లక్ష్యంతో వచ్చిన ప్రామాణిక టర్మ్ పాలసీ సరళ్ జీవన్ బీమా విషయంలో ఇలాంటివన్నీ ఉండవు. వ్యక్తుల ఆదాయం, ఇతర అంశాలతో సంబంధం లేకుండా పాలసీ జారీ చేయాలి. ఇది బీమా సంస్థలకు కొంత రిస్కుతో కూడిందే. అందుకే, ఈ పాలసీకి సాధారణ టర్మ్ పాలసీతో పోలిస్తే ప్రీమియం అధికంగా ఉంటుంది’ అని ఒక బీమా సంస్థ ప్రతినిధి తెలిపారు. ప్రీమియం నిర్ణయించే విషయంలో బీమా సంస్థలకే పూర్తి స్వేచ్ఛ ఉండటం వల్లా ఈ పాలసీలు ఖరీదవుతున్నాయి. అందరికీ బీమా అందాలంటే ప్రామాణిక పాలసీలను తక్కువ ప్రీమియానికి అందించినప్పుడే సాధ్యం అవుతుంది. ఉదాహరణకు 42 ఏళ్ల వ్యక్తికి రూ.25 లక్షల సరళ్ బీమా యోజనను ఒక బీమా సంస్థ 25 ఏళ్ల వ్యవధికి రూ.27,612 ప్రీమియానికి అందిస్తోంది. అదే మరో సంస్థ 42 ఏళ్ల వ్యక్తికి 25 లక్షల ఆన్‌లైన్ టర్మ్ బీమా పాలసీకి 25 ఏళ్ల వ్యవధికి రూ.12వేల లోపే ప్రీమియం వసూలు చేస్తోంది.
సొంత పాలసీలతోనే..
ప్రామాణిక పాలసీలకు బదులు బీమా సంస్థలు తమకు లాభదాయంగా ఉన్న పాలసీలను అధికంగా ప్రవేశ పెడుతున్నాయి. మార్కెట్లో ఉన్న పోటీ దృష్ట్యా సొంత పాలసీలను మరింత మెరుగులతో తీసుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రామాణిక పాలసీలను అందించేందుకు సంస్థలు అంతగా ముందుకు రావడం లేదు. కేవలం నిబంధనలను పాటించేందుకు అమల్లోకి తెస్తున్నారు మినహా, ఆ పాలసీలను ప్రోత్సహించడంపై దృష్టి సారించడం లేదు. కేవలం ప్రీమియం విషయంలోనే పోటీపడటంతో ఉపయోగం లేదన్నట్లు భావిస్తున్నాయి.
గ్రామీణులకు కష్టంగా..
గ్రామీణ ప్రాంతాల్లోని వారికి బీమా ద్వారా అందే ఆర్థిక భద్రత చాలా తక్కువే. టర్మ్ పాలసీల్లాంటివి తీసుకునేందుకు చాలామందికి అర్హత ఉండదు. ఇలాంటివారికి ప్రాంతం, ఆదాయంతో సంబంధం లేకుండా అందుబాటులో ఉండే ప్రామాణిక టర్మ్ పాలసీ ఎంతో ప్రయోజనం. కానీ, బీమా సంస్థలు వీటిపై అంతగా శ్రద్ధ పెట్టకపోవడం, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారికి అవగాహన లేకపోవడంతో ఫలితాలు కనిపించడం లేదు. ప్రీమియం తగ్గించడం, ఈ పాలసీలను ఇచ్చేందుకు బీమా సంస్థలు ఆసక్తి చూపిస్తే మినహా, ప్రభుత్వం ఆశించిన లక్ష్యం నెరవేరదని నిపుణులు చెబుతున్నారు.
ఇవీ చదవండి: