టమాటా సరఫరా పెంచేదుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పటికీ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ముఖ్యంగా దేశ రాజధాని దిల్లీలో కిలో టమాటా ధర రూ.60-80 పలుకుతోంది.
టమాటాలు అత్యధికంగా పండించే కర్ణాటక, మహారాష్ట్రలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా మార్కెట్లో లభ్యత భారీగా తగ్గింది. ఈ కారణంగా ధరలు మండిపోతున్నాయి.
వినియోగదారు వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం.. అక్టోబర్ 1న రూ.45గా ఉన్న కిలో టమాటా ధర నేడు రూ.60 దాటింది. ప్రాంతాన్ని, నాణ్యతను బట్టి కిలో రూ.80 వరకు విక్రయిస్తున్నట్లు తెలిసింది.
సరఫరా పెంచండి..
టమాటాలు అధికంగా పండించే రాష్ట్రాలు.. దిల్లీ సహా లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాలకు సరఫరా పెంచి ధరలు నియంత్రించాలని కేంద్రం సూచించింది. ఇందుకు అనుగుణంగా ఆయా రాష్ట్రాలు నిత్యం వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ, వ్యాపారులు, సరఫరాదారులతో చర్చలు జరుపుతున్నాయి. త్వరలోనే అన్ని ప్రాంతాలకు టమాటా సరఫరా పెరిగి.. ధరలు సాధారణ స్థితికి చేరతాయని అంటున్నాయి.
దేశంలో ఏటా 20 మిలియన్ టన్నుల టమాటా దిగుబడి జరుగుతోంది. దేశ అవసరాలకు ఇది సరిపోతుంది.
ఇదీ చూడండి: బంగారం ధరలు తగ్గుముఖం.. వెండి మాత్రం పైపైకి