కరోనా సంక్షోభం నేపథ్యంలో, మార్చి 1-మే 31 మధ్య రుణ కిస్తీల చెల్లింపును వాయిదా వేసేలా ఇచ్చిన ఆదేశాల స్ఫూర్తి అమలయ్యేలా చూడాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)ను సుప్రీంకోర్టు ఆదేశించింది. రుణ గ్రహీతలకు బ్యాంకులు ఈ ప్రయోజనాన్ని కల్పిస్తున్నట్లు లేవని కోర్టు పేర్కొంది.
ఆర్‌బీఐ కల్పించిన ప్రయోజనాన్ని రుణగ్రహీతలకు బ్యాంకులు బదలాయించడం లేదని, కేంద్రం తరఫున హాజరైన సోలిసిటర్ జనరల్ తుషార్ మెహ్తాతో కోర్టు వ్యాఖ్యానించింది.
ఆర్‌బీఐ మార్చి 27న ఇచ్చిన ఆదేశాల స్ఫూర్తిని కనుక అమలు చేయకపోతే, పూర్తిగా పక్కన పెట్టాలని న్యాయమూర్తులు జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ బి.ఆర్.గవాయ్‌లతో కూడిన బెంచ్ పేర్కొంది. ఆర్‌బీఐ ఆదేశాల స్ఫూర్తి అమలయ్యేలా చూడాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై వీరు దృశ్య మాధ్యమ విధానంలో విచారణ నిర్వహించారు. ఈ వ్యాజ్యాలు దాఖలు చేసిన నలుగురు, బాధితులు కానందున, ఆర్‌బీఐ ఆదేశాలపై జోక్యం చేసుకోబోమని బెంచ్ పేర్కొంది. కానీ, సర్క్యులర్ ఉద్దేశం అమలయ్యేలా చూడాలని ఆర్‌బీఐను ఆదేశించింది.
ఇదీ చూడండి:11ఏళ్ల కనిష్ఠానికి బంగారు ఆభరణాల డిమాండ్