భారత్‌లో బంగారం ఆభరణాల డిమాండ్ ఒక్కసారిగా 11ఏళ్ల కనిష్ఠానికి పడిపోయింది. తొలి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 73.9 టన్నులకు పడిపోయింది. గతేడాదితో పోల్చితే ఇది 41శాతం తక్కువని ప్రపంచ బంగారు మండలి (డబ్ల్యూజీసీ) తెలిపింది. అప్పటికే.. దేశీయంగా ఉన్న పసిడి ధరలు, కరెన్సీ క్షీణతపై కరోనా వైరస్ ప్రభావం పడటం వల్ల ఇలా జరిగిందని పేర్కొంది.
పెళ్లిళ్ల సీజన్‌తో తొలి త్రైమాసికంలోని తొలి భాగంలో పసిడికి డిమాండ్ పెరిగింది. అయితే ఫిబ్రవరి మధ్య వారాల్లో స్థానికంగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఫలితంగా కొనుగోలుదారులు బంగారంవైపు మొగ్గు చూపలేదు. ఆ తర్వాత అమలైన లాక్డౌన్ వల్ల మార్కెట్లు భారీగా నష్టపోయాయి. మార్చి నెలలో 60-80శాతం మేర డిమాండ్ పడిపోయింది. క్యూ1లో 10గ్రాముల పసిడి ధర సగటున రూ.41,124గా ఉండగా.. మార్చిలో స్థానిక బంగారం ధర నూతన రికార్డులను సృష్టించి రూ. 44,315 (10 గ్రాముల పసిడి)కు చేరింది.
ఆ తర్వాత దేశంలో కరోనా విజృంభించింది. దీంతో నగరాల్లోని మధ్యతరగతి కొనుగోలుదారులు, గ్రామీణ ప్రాంతాల్లోని వారు బంగారం కొనుగోలు చేయడానికి ఇష్టపడలేదు.
అయితే రెండో త్రైమాసికంలో పరిస్థితులు మరింత దారుణంగా ఉంటాయని నివేదికలు చెబుతున్నాయి.