బడ్జెట్ 2021-22లో కేంద్రం భారీ పెట్టుబడుల ఉపసంహరణ ప్రణాళికతో పాటు.. పలు ప్రభుత్వ సంస్థలను (పీఎస్‌యూ) ప్రైవేటీకరించనున్నట్లు ప్రకటించింది. కేంద్రం ప్రతిపాదించిన ఈ పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం.. ప్రభుత్వ ఖజానాకు ఆదాయం సమకూర్చడం మాత్రమే కాదని ఆర్థిక శాఖ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. ఇది దేశంలో శక్తిమంతమైన పారిశ్రామిక వాతావరణాన్ని సృష్టించి.. స్థిరమైన వృద్ధికి తోడ్పడుతుందని తెలిపారు.
ప్రభుత్వ లక్ష్యాలు..
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 1న ప్రవేశపెట్టిన బడ్జెట్లో.. 2021-22లో పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం రూ.1.75 లక్షల కోట్లుగా పేర్కొన్నారు. ఇది బడ్జెట్ వ్యయాల్లో 5 శాతానికి సమానం. దీనితోపాటు నాలుగు వ్యుహాత్మక రంగాలు మినహా.. మిగతా పీఎస్‌యూల్లో ప్రభుత్వ వాటాను తగ్గించుకోనున్నట్లు వెల్లడించారు.
ఈ విషయంపై.. పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగ (దీపమ్) కార్యదర్శి తహిన్ కాంత పాండే 'ఈటీవీ భారత్'తో ప్రత్యేకంగా మాట్లాడారు. పెట్టుబడుల ఉపసంహరణ ముఖ్య ఉద్దేశం పీఎస్‌యూల్లో ప్రభుత్వ వాటా తగ్గించుకోవడం ద్వారా.. దేశంలో శక్తిమంతమైన పారిశ్రామిక వాతావరణాన్ని సృష్టించడమేనన్నారు. ఇది ఆర్థిక వ్యవస్థలో మరింత పోటీతత్వాన్ని పెంచడం సహా.. ప్రైవేటు రంగంలో భారీగా ఉద్యోగ కల్పనకు తోడ్పడుతుందని వివరించారు.
అవసరాలకు తగ్గట్లు మార్పు..
వేగంగా మారుతున్న ప్రపంచానికి తగ్గట్లు వ్యాపారాలు కూడా తక్షణ నిర్ణయాలతో.. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు నిధులు సమకూర్చడం ముఖ్యమన్నారు పాండే. ప్రభుత్వాలు కూడా రోజువారీ కార్యకలాపాల్లో కలగజేసుకోకుండా.. వ్యాపారాలు సజావుగా సాగేందుకు ఉత్ప్రేరకంగా పని చేయాలని పేర్కొన్నారు.
ఇందుకు ఎయిర్ఇండియా ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని ఉదహరించారు. ఎయిర్ఇండియా భారీ నష్టాలతో నడుస్తూ.. ప్రభుత్వ ఖజానాకు భారంగా మారుతున్నట్లు వివరించారు.
ప్రైవేటు రంగాలు దూసుకుపోతున్నాయ్..
ప్రభుత్వం తీసుకున్న ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పూర్తిగా సమర్థించిన పాండే.. భారత్‌ను ప్రైవేటు రంగ పోత్సాహంతో ఎదుగుతున్న ఆర్థికవ్యవస్థగా అభివర్ణించారు. ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ వాటా ఇప్పటికే గణనీయంగా తగ్గిందని తెలిపారు. ఆహారం సహా చాలా వస్తు, సేవలు ప్రైవేటు రంగ సంస్థలే అందిస్తున్నాయని గుర్తు చేశారు.
ఇదీ చదవండి:క్రిప్టో కరెన్సీపై త్వరలో కేంద్రం బిల్లు