సౌదీ చమురు క్షేత్రాలపై జరిగిన డ్రోన్ దాడుల ప్రభావం మన దేశ ద్రవ్యోల్బణం, ఆర్థిక గణాంకాలపై తాత్కాలికమేనని అభిప్రాయపడ్డారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్. సౌదీలోని ప్రపంచలోనే అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారంపై ఇటీవలే డ్రోన్ దాడులు జరిగాయి. ఫలితంగా ఒక్కసారిగా ముడిచమురు ధరలకు రెక్కలొచ్చాయి. ఎవరూ ఊహించని విధంగా 20శాతం మేర పెరిగాయి. రూపాయి ధర క్షీణించడం, సౌదీ సంక్షోభంతో ముడి చమురు సరఫరాకు దీర్ఘకాలిక అంతరాయం కలిగుతుందనే భయాలతో.. తాజాగా 80 శాతానికి పైగా దేశీయ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడింది.
ఈ నేపథ్యంలో దేశంలో నెలకొన్న చమురు సంక్షోభంపై స్పందించారు రిజర్వు బ్యాంకు గవర్నర్. ముంబయిలో జరిగిన బ్లూమ్బర్గ్ ఇండియా ఆర్థిక సదస్సులో భాగంగా మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితులు కొద్ది కాలమే ఉంటాయని అభిప్రాయపడ్డారు.
" ద్రవ్యోల్బణం, ఆర్థిక గణాంకాలపై సౌదీ సంక్షోభం ప్రభావం పరిమిత కాలమే ఉంటుంది. సౌదీలో దాడి జరిగిన చమురు కేంద్రాల్లో ఇప్పటికీ ఉత్పత్తి పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూపాయి స్వల్పశ్రేణిలో కదలాడింది. మొదటి త్రైమాసికంలో బలపడగా.. ఆగస్టు, సెప్టెంబరులో స్వల్పంగా బలహీనపడింది."
- శక్తికాంత దాస్, ఆర్బీఐ గవర్నర్
మరిన్ని వడ్డీ రోట్ల కోతలకు అవకాశం
కీలక రేట్లను ఇంకా తగ్గించడానికి అవకాశం ఉందన్నారు దాస్. వృద్ధి తగ్గుతూ వస్తుండటం, ద్రవ్యోల్బణం అదుపులో ఉండటాన్ని ఇందుకు కారణాలుగా తెలిపారు. వృద్ధి పుంజుకోవడానికి చర్యలు చేపట్టాలంటే ప్రభుత్వానికి ద్రవ్యలోటు వంటి అడ్డంకులు ఉన్నాయని.. అందుకు మూలధనం వ్యయం ఒక్కటే పరిష్కారమని పేర్కొన్నారు. గతేడాది డిసెంబరు నుంచి శక్తికాంత దాస్ నేతృత్వంలోని ఆర్బీఐ వరుసగా నాలుగు సార్లు కీలక రేట్లపై కోత వేసింది.