దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఉద్దీపన పథకాలు ఇప్పుడే చేపట్టొద్దని సూచిస్తూ.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఆంగ్ల పత్రిక ద్వారా బహిరంగ లేఖ రాశారు కేంద్ర బ్యాంకు(ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు.
'డబ్బు పెట్టెలు తెరవటానికి ఇదే సరైన సమయం.. అంటూ మీకు చాలా మంది సలహా ఇస్తుండవచ్చు. అడక్కపోయినా మీకు సలహా ఇస్తున్నా. ఆ ఒత్తిడికి మీరు తలొగ్గవద్దు’ అని దువ్వూరి సుబ్బారావు పేర్కొన్నారు.
ఈ ఏడాది ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో జీడీపీ (స్థూల జాతీయోత్పత్తి) వృద్ధి రేటు 5 శాతానికి పరిమితం అయింది. ఇది గత ఆరేళ్లలో కనిష్ఠ స్థాయి. ప్రభుత్వం వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకోవాలనే సూచనలు ఎక్కువయ్యాయి. ఉద్దీపన పథకాలు ప్రకటించాలని, తద్వారా ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించాలని ఎంతో మంది కోరుతున్నారు. కానీ అందుకు అవసరమైన నిధులు ప్రభుత్వం వద్ద లేవని దువ్వూరి పేర్కొన్నారు.
"వాస్తవిక ద్రవ్యలోటు బడ్జెట్‌లో పేర్కొన్న దానికంటే ఎక్కువ ఉంటుందని మీతో (సీతారామన్) సహా ప్రతి ఒక్కరికీ తెలుసు, ఈ విషయాన్ని అంగీకరించకపోవటం సహేతుకం కాదు. పన్ను వసూళ్లు గత రెండేళ్లలో బడ్జెట్ అంచనాల కంటే తక్కువగా ఉన్నాయి. బడ్జెట్‌లో నిర్దేశించుకున్న ద్రవ్యలోటు లక్ష్యాన్ని సాధించినట్లు చూపటానికన్నట్లుగా.. వ్యయాలు తగ్గించారు. చివరికి ప్రభుత్వ రంగ సంస్థలకూ చెల్లింపులు నిలిపివేశారు’"
-లేఖలో దువ్వూరి సుబ్బారావు
ద్రవ్యలోటు లక్ష్యాలు సాధించేందుకు 2019-20 ఆర్థిక సంవత్సరానికి జీడీపీలో 3.3 శాతానికి ద్రవ్యలోటును పరిమితం చేయాలని లక్ష్యం నిర్దేశించుకుంది ప్రభుత్వం. మధ్యంతర బడ్జెట్‌లో చెప్పిన దానికంటే ఇది 10 బేసిస్ పాయింట్లు తక్కువ. గతంలో ద్రవ్యలోటు లక్ష్యాలు సాధించడానికి ప్రభుత్వం ఆహార సబ్సిడీని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) ఖాతాలో వేయటం, జాతీయ చిన్న పొదుపు నిధి నుంచి రుణాలుగా చూపించటం వంటి అనూహ్య పద్ధతులు అనుసరించింది.
రూ.1.76 లక్షల కోట్లు రావడం అదృష్టం
ప్రభుత్వ పన్ను ఆదాయ అంచనాలు అసంబద్ధంగా ఉన్నాయంటూ ఆర్బీఐ నుంచి రూ.1.76 లక్షల కోట్లు రావడం ప్రభుత్వ అదృష్టమని దువ్వూరి తన లేఖలో పేర్కొన్నారు. ‘ఈ నిధులతో ద్రవ్యలోటు భారం కొంతవరకు తగ్గుతుంది, కానీ ఆ తర్వాత ఏమిటి? వచ్చే ఏడాది ఏం చేస్తారు’ అని ప్రశ్నించారు. ఆర్థిక లోటు పెరిగిపోతుండటం పైనా దువ్వూరి సుబ్బారావు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక లోటును జీడీపీలో 2.3 శాతంగా అంచనా వేశారు. క్రితం ఆర్థిక సంవత్సరంలో ఇది 2.2 శాతంగా ఉంది. ప్రస్తుత ఖర్చుల కోసం అప్పులు చేయటం సరికాదు- అని ఆయన పేర్కొన్నారు. ‘పరిస్థితులు ఈ విధంగా ఉన్న తరుణంలో ‘ఆర్థిక ఉద్దీపనా పధకాలు’ ప్రవేశపెట్టాలని మీరు అనుకుంటే, దానివల్ల జరిగే నష్టం అంతాఇంతా కాదు’ అని హెచ్చరించారు. ద్రవ్యోల్బణం అదుపులో ఉందనే కారణంతో ‘ఉద్దీపన’ వైపు మొగ్గుచూపటం సరికాదన్నారు.
ఇవి గమనించాలి
‘ఉద్దీపన ప్రకటించాలని వాదించే వారు, జీడీపీ - రుణాల నిష్పత్తి ఇతర దేశాలతో పోల్చుకుంటే మనదేశం విషయంలో తక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. కానీ ఇతర ప్రామాణికాలను పరిగణనలోకి తీసుకోకుండా కేవలం జీడీపీ రుణాల నిష్పత్తి పైనే ఆధారపడితే తప్పుదోవపట్టినట్లు అవుతుంద’ని సుబ్బారావు పేర్కొన్నారు. ద్రవ్య విధానం ‘కౌంటర్- సైక్లికల్’ పద్ధతిలో ఉండాలనే వాదనను ఆయన తిరస్కరించారు. భారతదేశం వంటి ప్రజాస్వామ్య దేశాలకు ఇది సరిపోదని చెప్పారు. ‘తన తర్వాత వచ్చే ఆర్థిక మంత్రి హాయిగా ఖర్చు చేసేందుకు అవసరమైన నిధులను ఏ ఆర్థిక మంత్రి అయినా తన కాలంలో కష్టపడి మిగుల్చుతారా? ఒక కాలచక్రంలో ద్రవ్య సర్దుబాటు మంచి ఆలోచనే. కానీ అందుకు మనం ఆర్థికంగా కోలుకునే వరకూ ఎదురుచూడాల్సి వస్తుంది. అందువల్ల ప్రస్తుతానికి స్పందించకుండా ఉండటం మంచిది, తప్పనిసరి అవసరం కూడా’ అని దువ్వూరి సుబ్బారావు పేర్కొన్నారు.
పదిహేనేళ్ల క్రితం డాక్టర్ రంగరాజన్, నేను ఇదే శీర్షిక (ద ఇంపార్టెన్స్ ఆప్ బీయింగ్ ఎర్నెస్ట్ అబౌట్ ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ) తో ఒక వ్యాసం రాశాం. ఆ సందేశం ఇప్పటికీ సరిపోతుంది, మనకు ఎదురవుతున్న సవాళ్లు మారలేదని తెలిసిపోతోంది- అని వివరించారు.