ఈ ఆర్థిక సంవత్సరం చివరి కల్లా బ్యాంకింగేతర ఆర్థిక కంపెనీ(ఎన్‌బీఎఫ్‌సీ)లు ఇచ్చిన రుణాల్లో ఒత్తిడికి గురవుతున్న మొత్తాలు రూ.1.5-1.8 లక్షల కోట్లకు చేరొచ్చని, ఆయా సంస్థలు నిర్వహిస్తున్న ఆస్తుల్లో (ఏయూఎం) ఈ వాటా 6.0-7.5 శాతంగా ఉండొచ్చని క్రిసిల్ అంచనా వేస్తోంది. గత నెలలో విడుదలైన ఆర్‌బీఐ ఆర్థిక స్థిరత్వ నివేదిక ప్రకారం.. ఎన్‌బీఎఫ్‌సీల స్థూల నిరర్ధక ఆస్తులు 2020 మార్చి ఆఖరుకు 6.3 శాతానికి చేరాయి. 2019 మార్చి ఆఖరుకు 5.3 శాతంగా ఉన్నాయి. ఒకసారి అవకాశం ఉండే కొవిడ్-19 పునర్నిర్మాణ గవాక్షంతో పాటు ఆర్‌బీఐ ప్రకటించిన సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి కంపెనీ(ఎంఎస్‌ఎంఈ) రుణ పునర్నిర్మాణ పథకం కారణంగా ఎన్‌బీఎఫ్‌సీ స్థూల నిరర్థక ఆస్తులు(జీఎన్‌పీఏ) కాస్త తగ్గవచ్చని క్రిసిల్ రేటింగ్స్ తన నివేదికలో వెల్లడించింది.
- ఎన్‌బీఎఫ్‌సీలకు ఈ ఆర్థిక సంవత్సరం కరోనా రూపంలో అనుకోని సవాళ్లు ఎదురయ్యాయి. ఇపుడు పరిస్థితి మెరుగుపడుతున్నా.. ఇంకా కరోనా ముందు స్థాయిలకు చేరలేదు.
- కొన్ని విభాగాల్లో మొండి బకాయిలు బాగా పెరిగాయి. పసిడి తనఖా, గృహ రుణాలపై మాత్రం చాలా తక్కువ ప్రభావం పడింది.
- స్థిరాస్తి ఇతర రంగాలకిచ్చిన టోకు రుణాలు, వాహన రుణాలు, ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ రుణాలు, హామీ లేని రుణాలు ఒత్తిడికి గురయ్యాయి.
- వాహన రుణాల విషయానికొస్తే కరోనా ప్రభావం క్రమంగా తగ్గే అవకాశం ఉంది. వసూళ్ల సామర్థ్యం పుంజుకుంటోంది.
- అతిపెద్ద సవాలేదైనా ఉందంటే హామీ లేని వ్యక్తిగత రుణాల విభాగమే. చాలా వరకు ఎన్‌బీఎఫ్‌సీల్లో ఈ రుణాల ఒత్తిడి రెట్టింపైంది. హామీ లేకుండా ఎంఎస్‌ఎంఈలకిచ్చిన రుణాల్లోనూ ఈ ప్రభావం కనిపిస్తోంది. అధిక రైటాఫ్‌ల కారణంగా మొండి బకాయిల గణాంకాలపై ఒత్తిడి కాస్త తగ్గొచ్చు.
- గతంలో ఈ తరహా ఆస్తుల నాణ్యత విషయంలో ఎదురైన సవాళ్లను సమర్థంగా తట్టుకున్న ఎన్‌బీఎఫ్‌సీలు, ప్రస్తుత సవాళ్లనూ అధిగమిస్తాయన్న అంచనాలున్నాయి. వసూలు యంత్రాంగాన్ని సాంకేతికతతో సమర్థంగా నిర్వహిస్తున్నారు.